సర్ పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించం

ఎస్ఐఆర్పై పార్టీ నాయకుల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్పై అవగాహన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ జూమ్ సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఎస్ఐఆర్ వంటి సీరియస్ అంశంపై పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియ వల్ల పేదల ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. పేదల ఓటు పోతే వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి వాటిపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
ఎస్ఐఆర్పై పార్టీ ఇచ్చిన ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షమించబోమని హెచ్చరించారు.
