తెలంగాణ ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం

కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ వరాల జల్లు కురిపిస్తోంది. అధికారంలోకి వస్తే పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓట్లు కురిపించిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని తెలంగాణలో కూడా ప్రవేశపెడతామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ల పాటు పట్టించుకొని బీఆర్ఎస్ ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రకటించడానికి ప్రయత్నిస్తోందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవరూ నమ్మరని ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆయన వివరించారు. త్వరలోనే కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు.
