కాంగ్రెస్ లోకి మోత్కుపల్లి ..డీకే శివకుమార్ తో భేటీ
1 min readసీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పనున్నారు. సీఎం కేసీఆర్ వైఖరి పై గుర్రుగా ఉన్న ఆయన గులాబీ కండువా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో మోత్కుపల్లి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దళిత బంధు స్కీం ప్రారంభంలో ఆయనను సీఎం కేసీఆర్ బాగా ఇన్వాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ ఆయనను పట్టించుకోలేదు. గత ఆరు నెలల నుంచి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో నర్సింహులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతూ కేసీఆర్ పైన విమర్శలు గుప్పించారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన పొగడ్తలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తు మోత్కుపల్లి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో బెంగళూరులో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయనకు తెలిపారు. దీంతో మోత్కుపల్లి చేరిక దాదాపు ఖాయమైంది. నర్సింహులు గతంలో కూడా కాంగ్రెస్ లో పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ లో చేరారు. తెలంగాణలో తెలుగుదేశం బలహీనం కావడంతో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.