*హైదరాబాద్ సిటీకి సరి కొత్త ‘క్యూర్’*

ఒకే ప్రాపర్టీ ఐడీ.. ఒకే బిల్లు.. ఒకే పోర్టల్
రిజిస్ట్రేషన్‌తోనే ఆటోమేటిక్‌గా మ్యూటేషన్
పరిమిత సీలింగ్ మేరకు ఆస్తిపన్ను పెంపు
ఆన్ లైన్లో భవన అనుమతులు.. ఆలస్యమైతే అప్పీల్
రోడ్లు, ట్రాఫిక్, చెరువులు, విపత్తులపై సమగ్ర వ్యవస్థ
హైదరాబాద్ నగర ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత సులభతరం చేసే కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం–2026 తీసుకొచ్చింది. అక్టోబర్ 2 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ చట్టం వర్తిస్తుంది.
మున్సిపల్ శాఖను స్వయంగా చూస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నగర పాలనపై నేరుగా పర్యవేక్షణ సాగించేలా కొత్త వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ పనిచేస్తుంది. నగరాభివృద్ధి ప్రాధాన్యాలను ఈ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. కార్పొరేషన్లు, పోలీస్, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జలమండలి, విద్యుత్, మెట్రో, ఆర్టీసీ, హైడ్రా అధికారులు ఒకే వేదికపై చర్చించి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ కొత్త చట్టంలోకి వచ్చింది.
*15 లక్షల నుంచి 1.3 కోట్లకు..*
1955లో పాత మున్సిపల్ చట్టం వచ్చినప్పుడు హైదరాబాద్ జనాభా సుమారు 15 లక్షలు. ఇప్పుడు కోర్ అర్బన్ రీజియన్‌లో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. నగరం భారీగా విస్తరించింది. వరదలు, ఎండ తీవ్రత, వాయు కాలుష్యం, నీటి కొరత, ట్రాఫిక్, చెరువులు–నాలాల ఆక్రమణలు, ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదాల ముప్పు వంటి కొత్త సవాళ్లు వచ్చాయి. ఈ మార్పులకు అనుగుణంగా నగర పాలనా వ్యవస్థను మార్చేందుకు ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. మూడు కార్పొరేషన్ల ప్రస్తుత సరిహద్దులు మాత్రం మారవు. మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ, కమిషనర్, వార్డు కమిటీ వ్యవస్థ కొనసాగుతుంది. ఐదేళ్ల పదవీకాలం కూడా యథాతథంగా ఉంటుంది.
*ఇంటి రిజిస్ట్రేషన్‌తోనే మ్యుటేషన్*
ఇంటి కొనుగోలు తర్వాత మ్యుటేషన్ కు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరాన్ని కొత్త చట్టం తగ్గించనుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే మ్యూటేషన్ ఆటోమేటిక్‌గా కొనసాగుతుంది.
ప్రతి ఆస్తికి ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ ఐడెంటిటీ కోడ్ ఇస్తారు. ఆస్తికి సంబంధించిన మున్సిపల్ వివరాలన్నీ ఈ గుర్తింపు సంఖ్యతో అనుసంధానమవుతాయి.
ఆస్తిపన్ను, నీటి బిల్లు, మురుగునీటి ఛార్జీలు, పారిశుద్ధ్య బకాయిలను కలిపి ‘క్యూర్–1’ పేరుతో ఒకే బిల్లు ఇస్తారు. మున్సిపల్ సేవలు, అనుమతులు, లైసెన్సులను ఒకే పోర్టల్ ద్వారా పొందే విధానం వస్తుంది.
*ఆస్తిపన్ను పెంపుపై పరిమితి*
ఆస్తిపన్ను విధానంలో కీలక మార్పు చేశారు. ఇక వార్షిక అద్దె విలువకు బదులుగా రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించే గైడ్లైన్ విలువ ఆధారంగా పన్ను లెక్కిస్తారు. 375 చదరపు అడుగుల వరకు ఉన్న ఆస్తులకు రూ.101 నామమాత్రపు పన్నే కొనసాగుతుంది. మిగతా నివాస ఆస్తులకు గైడ్లైన్ విలువపై 0.10 శాతం నుంచి 0.50 శాతం మధ్య రేటును ఆయా కార్పొరేషన్లు నిర్ణయిస్తాయి. నివాసేతర ఆస్తులకు 0.20 శాతం నుంచి 2 శాతం మధ్య రేటు ఉంటుంది.
కొత్త రేట్లు ఖరారయ్యే వరకు నివాస ఆస్తులకు 0.15 శాతం వర్తిస్తుంది. నివాసేతర ఆస్తులకు 0.75 శాతం రేటు ఉంటుంది. కొత్త విధానంతో ఒక్కసారిగా పన్ను భారం పెరకుండా పరిమితులు విధించారు. గత ఏడాది పన్నుతో పోలిస్తే ఏ సంవత్సరంలోనూ పెరుగుదల 10 శాతం దాటదు. ప్రస్తుతం రూ.10 వేల ఆస్తిపన్ను చెల్లిస్తున్న వ్యక్తి మొదటి ఏడాది గరిష్ఠంగా రూ.11 వేలే చెల్లిస్తారు.
*భవన అనుమతుల్లో ఆలస్యానికి చెక్*
భవన అనుమతుల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో సాగుతుంది. నిర్ణీత సమయంలో అధికారులు నిర్ణయం తీసుకోకపోతే దరఖాస్తు పైస్థాయికి వెళ్తుంది. నిర్ణయం రాని సందర్భాల్లో డీమ్డ్ అప్రూవల్‌కు చట్టం అవకాశం ఇస్తోంది.
లైసెన్సింగ్ విధానాన్ని కూడా సులభతరం చేశారు. రాత్రివేళల్లో ఎక్కువ సమయం వ్యాపార కార్యకలాపాలు కొనసాగే నైట్ ఎకానమీ జోన్లను ప్రభుత్వం ప్రకటించనుంది.
చిన్న ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు పెట్టే పాత విధానంలోనూ మార్పు వస్తుంది. చాలా ఉల్లంఘనలకు సివిల్ జరిమానాలు ఉంటాయి. ముందుగా షోకాజ్ నోటీసు ఇస్తారు. ఆ తర్వాతే జరిమానాపై నిర్ణయం తీసుకుంటారు.
*రోడ్డు తవ్వాలంటే.. కమిటీ ఓకే చెప్పాలి*
నగరంలో ఒక శాఖ వేసిన రోడ్డును మరో శాఖ కొద్ది రోజులకే తవ్వే పరిస్థితులకు చెక్ పెట్టేలా కొత్త వ్యవస్థ వస్తోంది. యుటిలిటీ కోఆర్డినేషన్ కమిటీ రోడ్డు తవ్వకాలపై శాఖల మధ్య సమన్వయం చేస్తుంది. ట్రాఫిక్ నిర్వహణకు క్యూర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ అథారిటీ పనిచేస్తుంది. ఫుట్‌పాత్‌లు, పాదచారుల క్రాసింగ్‌లు, కర్బ్ ర్యాంపులు, వీధి దీపాలు, ట్రాఫిక్ సిగ్నళ్లపై ప్రత్యేక దృష్టి ఉంటుంది. పాఠశాలల వద్ద సేఫ్ స్కూల్ జోన్లు ఏర్పాటు చేసే అవకాశం కూడా కొత్త చట్టంలో ఉంది.
*చెరువులు.. నాలాలకు మరింత రక్షణ*
చెరువులు, నాలాలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల పరిరక్షణకు కొత్త చట్టం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. చెరువు, నాలా, ఇతర జలవనరుల్లో మురుగునీరు లేదా కాలుష్య వ్యర్థాలను వదలరాదు.
చెరువులు, నాలాలు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు, వ్యర్థాలపై చర్యలకు హైడ్రాకు చట్టబద్ధమైన బలం లభిస్తుంది.
నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేకుండా పారేస్తే కఠిన జరిమానా ఉంటుంది. నాలా, చెరువు, ఫుట్‌పాత్‌పై పారేస్తే జరిమానా రెట్టింపు అవుతుంది.
నిర్దేశిత విస్తీర్ణం దాటిన భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలి. పర్యావరణహిత చర్యలు తీసుకునే ఆస్తులకు అదనపు ఆస్తిపన్ను రాయితీ ఇచ్చే అవకాశం ఉంది.
*విపత్తులకు శాశ్వత ప్రణాళిక*
కోర్ అర్బన్ రీజియన్ మొత్తానికి ఒకే విపత్తు నిర్వహణ ప్రణాళిక ఉంటుంది. క్యూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విపత్తుల నివారణ, ముందస్తు సన్నద్ధత, స్పందన, పునరుద్ధరణ చర్యలను సమన్వయం చేస్తుంది. హైడ్రా విపత్తు స్పందన సంస్థగా పనిచేస్తుంది.
ఎత్తైన భవనాలు సహా నిర్దేశిత భవనాలకు ఫైర్ ఆడిట్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసే అవకాశం ఉంటుంది. ప్రమాద స్థాయిని బట్టి తనిఖీలు చేపడతారు. ప్రాణాలకు తక్షణ ముప్పు ఉన్న భవనాన్ని లోపాలు సరిచేసే వరకు సీల్ చేయవచ్చు.
వీధులు, పార్కులు, బస్‌స్టాప్‌లు, రవాణా కేంద్రాల్లో తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లు, రవాణా ప్రాంతాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సీసీ కెమెరాల నిఘాకు చట్టం ప్రాధాన్యం ఇచ్చింది.
*మహిళలు.. వృద్ధులు.. గిగ్ కార్మికులపై దృష్టి*
మహిళలు, ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులు, చిన్నారులు, వృద్ధుల అవసరాలను నగర మౌలిక వసతుల్లో పరిగణనలోకి తీసుకోవాలని కొత్త చట్టం చెబుతోంది.
జెండర్ ఇన్‌క్లూజన్ సెల్ ఏర్పాటు చేస్తారు. ప్రతి కార్పొరేషన్లో ట్రాన్స్‌జెండర్ సమాజం నుంచి ఒకరికి ప్రాతినిధ్యం ఉంటుంది.
గిగ్, ప్లాట్‌ఫాం కార్మికులకు విశ్రాంతి ప్రదేశాలు, పారిశుద్ధ్య సదుపాయాలు, పార్కింగ్, ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. వీధి వ్యాపారులకు వెండింగ్ జోన్లలో మౌలిక సదుపాయాలు అందించవచ్చు.
*కాలం చెల్లిన నిబంధనలకు తెర*
70 ఏళ్ల నాటి చట్టంలో వందకు పైగా కాలం చెల్లిన నిబంధనలు ఉన్నాయి. టాంగాలు, జట్కాలు, ఎద్దుల బండ్లు, గుర్రాలు, ఒంటెలు, ఏనుగులపై పన్నుల ప్రస్తావన కూడా పాత చట్టంలో ఉంది. నగరంలోకి వచ్చే సరుకుపై ఆక్ట్రాయ్ వసూలు, ఆవిరి విజిల్ వాడకంపై అనుమతి, ఐదు నుంచి ఇరవై రూపాయల జరిమానాలు వంటి పాత నిబంధనలకు కొత్త చట్టం ముగింపు పలికింది.
#Hyderabad #HyderabadNews #CureBill #TelanganaNews #Healthcare #BreakingNews #VSRBreakingNews
