GHMC టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ ఏసీబీ వలలో.. రూ.4 లక్షల లంచం స్వీకరిస్తుండగా పట్టివేత

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్, సర్కిల్-33 మెహదీపట్నం కార్యాలయంలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ తులసీరామ్ సునీత ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీ సోమవారం (అక్టోబర్ 5) విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో వెల్లడించింది.ఏసీబీ వివరాల ప్రకారం.. భవన నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఫిర్యాదుదారుడికి అనుకూలంగా అధికారికంగా వ్యవహరించేందుకు రూ.8 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా రూ.4 లక్షల తొలి విడతను స్వీకరిస్తుండగా ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు ఆమెను పట్టుకున్నారు.జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్టాపింగ్ ఆర్డర్లను పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించేందుకు అనుమతించడం, ఫిర్యాదుదారుడిని మరింత వేధించకుండా ఉండటం, భవిష్యత్తులో సహకరించడం వంటి అంశాలకు సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది.

రూ.6.50 లక్షల నగదు స్వాధీనం

నిందిత అధికారిణి వద్ద నుంచి లంచంగా స్వీకరించిన రూ.4 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా ఆమె వద్ద ఉన్న లెక్కల్లో చూపని రూ.2.50 లక్షల నగదును కూడా గుర్తించి సీజ్ చేసినట్లు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంలో అధికారిణి తన విధులను సక్రమంగా నిర్వర్తించకుండా అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. కేసు దర్యాప్తులో భాగంగా నిందిత అధికారిణిని నాంపల్లిలోని ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను వెల్లడించలేదు.

లంచం డిమాండ్ చేస్తే 1064కు ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

 

#GHMC #ACBTelangana #ACB #GHMCNews #BribeCase #Corruption #HyderabadNews #Hyderabad #TelanganaNews #Mehdipatnam #TownPlanning #GHMCCorruption #ACBRaid #ACBTrap #TelanganaBreakingNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn