సివిల్స్ లో తెలంగాణ అభ్యర్థులు రాణించాలి
1 min readఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారని ఆయన అన్నారు. సివిల్స్ కు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల కు సింగరేణి తరుపున లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ నుంచి మరింత మంది సివిల్ సర్వీస్ లకు ఎంపిక కావాలని ఆశించారు. సివిల్స్ లో మన రాష్ట్ర అభ్యర్థులు ఎక్కువ మంది రాణించాలని మా ఉద్దేశంతోనే వారిని ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. బీహార్ నుంచి అత్యధికంగా సివిల్స్ లో రాణిస్తున్నారని మనమెందుకు ఆ స్థాయిలో ఎంపిక కావడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కమిట్మెంట్ ఉంటేనే విజయం వరిస్తుందన్న ఆయన ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతీ ఒక్కరూ సివిల్స్ లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి ఏడాదిలోనే 55143 ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గత 14 ఏళ్లుగా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదన్న సీఎం అనేక అడ్డంకులు, కుట్రలను అధిగమించి 563 గ్రూప్ 1 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించామన్నారు. మార్చి 31 లోగా 563 గ్రూప్ 1 ఉద్యోగాల నియామకాలను పూర్తిచేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు.