చ‌ట్ట స‌భ‌ల్లోకి జెన్ జీ….రేవంత్ రెడ్డి

చ‌ట్ట స‌భ‌ల్లోకి జెన్ జీ….

* 21 ఏళ్ల‌కే శాస‌న‌స‌భ‌, లోక్‌స‌భ‌, 25 ఏళ్ల‌కే మండ‌లి, రాజ్య‌స‌భ‌కు పోటీ
* జెన్ జీకి అవ‌కాశం క‌ల్పించాలంటూ శాస‌న‌స‌భ‌లో ప్ర‌త్యేక తీర్మానం
* లోక్‌స‌భ‌లో 1 శాతం కంటే త‌క్కువ‌గా జెన్ జీ ప్రాతినిధ్యం
* రాహుల్ మంత్రివ‌ర్గంలో జెన్ జీకే విద్యా శాఖ
* జెన్ జీ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి
* జంత‌ర్‌మంత‌ర్‌లో విద్యార్థులపై దాడికి నిర‌స‌న‌గా కొవ్వొత్తుల ర్యాలీ

హైద‌రాబాద్‌: అత్యున్న‌త చ‌ట్ట స‌భ‌లైన శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లి, లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో జెన్ జీ త‌రం ప్రాతినిధ్యం వ‌హించాల‌ని, అందుకు అవ‌స‌ర‌మైన తీర్మానాన్ని శాస‌న‌స‌భ‌లో ఆమెదించి కేంద్రానికి పంపుతామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌పంచంలో అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో 21 ఏళ్ల‌కే ప్ర‌ధాన‌మంత్రులు అవుతున్నప్పుడు మ‌న దేశ యువ‌తకు ఎందుకు ఆ అవ‌కాశం ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నీట్ ప్ర‌శ్నా ప‌త్రాల లీక్‌కు బాధ్య‌త వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా, ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లింపు డిమాండ్‌, జంత‌ర్‌మంత‌ర్‌లో విద్యార్థుల‌పై లాఠీఛార్జీకి నిర‌స‌న‌గా పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్డు వ‌ర‌కు పీసీసీ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం రాత్రి నిర్వ‌హించిన కొవ్వొత్తు ర్యాలీలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంత‌రం వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన జెన్ జీని ఉద్దేశించి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. సింగ‌పూర్‌, బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాల్లో 21 ఏళ్ల‌కే ప్ర‌ధాన‌మంత్రులు అయ్యే అవ‌కాశం ఉంద‌ని, మ‌న దేశంలోనూ ఆ అవ‌కాశం జెన్ జీకి ఇవ్వాల్సి ఉంద‌న్నారు. రాజీవ్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 61వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేసి ఓటు హ‌క్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్ల‌కు త‌గ్గించార‌ని సీఎం తెలిపారు. నాడు రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణ‌యంతోనే నూనుగు మీసాల యువ‌కులు, సోద‌రీమ‌ణులు ఓటు హ‌క్కు పొంద‌గ‌లిగార‌ని చెప్పారు. అలాగే పి.వి.న‌ర‌సింహారావు ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప‌ట్ట‌ణ‌, గ్రామీణ స్థానిక సంస్థ‌ల్లో మేయ‌ర్లు, జ‌డ్పీ ఛైర్మ‌న్లు వంటి పోస్టుల‌కు ఎన్నిక‌య్యే వ‌య‌స్సును 25 నుంచి 21 ఏళ్ల‌కే త‌గ్గించార‌ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నాడు కాంగ్రెస్ ప్ర‌ధాన‌మంత్రులు తీసుకున్న నిర్ణ‌యంతోనే యువ‌త 18 ఏళ్ల‌కే ఓటు వేయ‌గలుగుతున్నార‌ని, 21 ఏళ్ల‌కే స్థానిక సంస్థ‌ల్లో ప‌దవులు సాధించ‌గ‌లుగుతున్నార‌ని తెలిపారు. 21 ఏళ్ల‌కే ఒక సోద‌రీమ‌ణి తిరువ‌నంతపురం మేయ‌ర్‌గా ఎంపిక కావ‌డానికి నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన అవ‌కాశ‌మే కార‌ణ‌మ‌న్నారు. లోక్‌స‌భ‌లో 543 మంది ఎంపీలు ఉంటే 1 శాతానికి లోపే జెన్ జీ ప్రాతినిధ్యం ఉంద‌న్నారు. 30 శాతంగా ఉన్న జెన్ జీకి లోక్‌స‌భ‌లో 1 శాతం క‌న్నా త‌క్కువ ప్రాతినిధ్యం ఉండ‌డం స‌రికాద‌న్నారు. 21 ఏళ్ల‌కే లోక్‌స‌భ‌కు, శాస‌న‌స‌భ‌కు పంపించే బాధ్య‌త తాము తీసుకుంటామ‌ని… అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించ‌గా.. తాము సిద్ధ‌మ‌ని జెన్ జీ స్పందించింది.

జెన్ జీ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలంటే చ‌ట్ట స‌భ‌ల్లోనూ వాళ్ల ప్రాతినిధ్యం ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఇందుకోసం శాస‌న‌స‌భ‌, లోక్‌స‌భ‌ల‌కు 21 ఏళ్లకు, శాస‌న‌మండ‌లి, రాజ్య‌స‌భ‌కు 25 ఏళ్ల‌కే పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని సీఎం అన్నారు. ఈ అంశంపై ఆగ‌స్టు మొద‌టి వారంలో శాస‌న‌స‌భ‌, శాస‌న‌మండ‌లిని ప్ర‌త్యేకంగా స‌మావేశం
ఏర్పాటు చేసి చ‌ట్ట‌స‌భ‌ల్లో పోటీ చేసే వ‌య‌స్సు త‌గ్గింపు తీర్మానం పెట్టి ఆమోదిస్తామ‌ని సీఎం తెలిపారు. ఆ తీర్మానాన్ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి, కేంద్ర ప్ర‌భుత్వానికి పంపుతామ‌ని సీఎం వెల్ల‌డించారు. దేశంలో అత్యున్న‌త‌మైన సివిల్ స‌ర్వీసుకు 21 ఏళ్ల‌కే ఎంపిక‌య్యే అవ‌కాశం ఉంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా 21 ఏళ్ల వ‌య‌స్సుకే శ్రీ‌ల‌క్ష్మి, 22 ఏళ్ల‌కే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన అన‌న్య‌, 22 ఏళ్ల‌కే ప్ర‌స్తుత డీజీపీ సి.వి.ఆనంద్ ఐపీఎస్‌లుగా ఎంపికైన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు.

జంత‌ర్ మంత‌ర్ నుంచి పార్ల‌మెంట్ కు ప్ర‌ద‌ర్శ‌న‌గా కాద‌ని, రోడ్ల‌పై నుంచి నేరుగా పార్ల‌మెంట్‌లోకి (స‌డ‌క్ సే సంస‌ద్‌) వెళ్లేలా యువ‌త ఉండాల‌న్నారు. 21 ఏళ్ల‌కే లోక్‌స‌భ‌కు పోటీ చేసే అవ‌కాశం ఉంటే స‌భ‌లోనే జెన్ జీ గ‌ళాన్ని వినిపించే అవ‌కాశం ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో జెన్ జీ గ‌ళం వినిపించ‌డం ద్వారా యువ‌త‌కు దేశాన్నిపాలించే అవ‌కాశం ఇవ్వాల‌ని శాస‌న‌స‌భ‌లో తీర్మానం చేస్తామ‌ని సీఎం పున‌రుద్ఘాటించారు. కేంద్రంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏర్పాట‌య్యే ప్ర‌భుత్వం విద్యా శాఖ జెన్ జీ నేతకు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశంలో రాహుల్ గాంధీని, ఇండియా కూట‌మి నేత‌ల‌ను ఒప్పిస్తాన‌ని సీఎం తెలిపారు. విద్యా శాఖ‌, ఐటీ శాఖ వంటి కీల‌క‌మైన శాఖ‌లు.. 60, 70, 90 ఏళ్ల వాళ్ల‌కు కాదు 21 వాళ్ల‌కే ఇవ్వాల‌ని, వాళ్ల‌కేం కావాలో వాళ్ల‌కే తెలుస‌ని సీఎం అన్నారు.

జెన్ జీ పోరాట ప‌టిమ‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శంసించారు. జెన్ జీ సాధించిన విజ‌యాల‌ను కాంగ్రెస్ పార్టీ ఖాతాలో రాసుకునే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. లాఠీలు, తూటాల‌కు త‌ల‌వంచ‌కుండా పోరాడి 56 అడుగుల ఛాతీ అని చెప్పుకునే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మెడ‌లు వంచి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించాగ‌లిగార‌ని ప్ర‌శంసించారు. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాతో పోరాటం ముగిసిపోలేద‌ని సీఎం అన్నారు. పరీక్ష పేప‌ర్ల లీక్‌తో చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం చెల్లింపు, ఉద్య‌మం సంద‌ర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల‌పై కేసులు సోమ‌వారం లోపు ఎత్తివేయ‌క‌పోతే పార్ల‌మెంట్‌లో రాహుల్ గాంధీ, ఖ‌ర్గేల నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ పోరాడుతుంద‌ని సీఎం తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్‌, సీత‌క్క‌, అజారుద్దీన్‌, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ కుమార్‌, పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ గౌడ్, ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్‌, ఎమ్మెల్యేలు దానం నాగేంద‌ర్‌, అరికెపూడి గాంధీ, వ‌ల్లాల న‌వీన్ యాద‌వ్‌, శ్రీ‌గ‌ణేష్‌, మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహ‌న్ రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి స‌త్యం, సీపీఐ నేత ప‌ల్లా వెంక‌ట్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn