హాలిడే తీసుకున్నది కేసీఆర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

హైదరాబాద్:
రాష్ట్రంలో కేసీఆర్ హాలిడే తప్ప మరెలాంటి హాలిడేలు లేవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అధికారం పోయాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో హాలిడేలు ఎంజాయ్ చేస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి హాలిడే ఇవ్వాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అహంకారం, అక్కసుతో కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఆయన మాటలు వింటే రక్తం మరిగుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మర్యాద ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామన్నారు.
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ మతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మూసీ పునరుజ్జీవనం, రివర్‌ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా తొలి దశలో 21 కిలోమీటర్ల మేర పనులకు డీపీఆర్ రూపొందించి, రూ.7,345 కోట్లతో పనుల కోసం టెండర్లు పిలిచామని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
మూసీపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా తమ పార్టీ నాయకులను ప్రభుత్వం అడ్డుకుందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూసీపై జరిగింది ప్రజాభిప్రాయ సేకరణ కాదని, స్టేక్‌హోల్డర్స్ కన్సల్టేషన్ సమావేశం మాత్రమేనన్నారు. గత ఏప్రిల్ నుంచే మూసీ వెబ్సైట్ ద్వారా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంలో కేటీఆర్ ఉన్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో కరువు లేదని ఒకసారి, కరువు ఉందని మరోసారి కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మతి లేదనిపిస్తోందన్నారు. ఎల్ నీనో ప్రభావం వల్ల ఏర్పడిన కరువును ఎదుర్కొవడానికి మహారాష్ట్రలో కోటిన్నర మంది రైతులకు ఐదు వేల చొప్పున సాయం చేస్తున్నారని వివరించారు. కర్ణాటకలో కూడా పంటలు ఎండిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారని, ఇవన్నీ కేటీఆర్‌కు కళ్లకు కనిపించడం లేదా అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయంటూ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలను ఆది శ్రీనివాస్ తోసిపుచ్చారు. రైతులకు విద్యుత్ అందించేందుకు బహిరంగ మార్కెట్లో అవసరమైన ధరకు విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. 20 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పటికీ సరఫరా చేశామని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లేక నిలిచిపోయిన పరిశ్రమను లేదా ఐటీ కంపెనీని చూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు.
భూగర్భ జలాలు తగ్గిన ప్రాంతాల్లో కొందరు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి పంటలను కాపాడుకుంటున్నారని, దీనికి విద్యుత్ కోతలు కారణం కాదని వివరించారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించలేదని, నీటి వినియోగం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మాత్రమే సూచించిందని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. పంట మార్పిడి గురించి ప్రభుత్వం సూచనలు చేస్తే దానిపైనా ప్రతిపక్షం రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సన్నవడ్లకు రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని, పంట దిగుబడి కూడా పెరిగిందని పేర్కొన్నారు. రైతులకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షం ఓర్వలేకపోతోందని విమర్శించారు.
కన్నెపల్లి వద్ద నీటిని ఎత్తిపోకుండా ఆంధ్రప్రదేశ్‌కు తరలించారన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ ఖండించారు. కన్నెపల్లి వద్ద పంప్ చేసిన నీళ్లను ఎక్కడ పోయాలని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని ఎన్డీఎస్ఏ సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. కాళేశ్వరం కింద దేవాదుల, సీతారామసాగర్ వద్ద గోదావరి నీటిని నిరంతరం ఎత్తిపోస్తున్నామని అన్నారు.
దేవాదుల, దుమ్ముగూడెం దగ్గర లక్షన్నర ఇసుక బస్తాలు వేసి నీళ్లు కిందకు వెళ్లకుండా నిల్వ చేస్తున్నామన్నారు. గోదావరిలో ప్రతి చుక్క నీటిని తెలంగాణ ప్రభుత్వం ఒడిసిపట్టుకునేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కేటీఆర్, హరీష్ రావు వస్తే గోదావరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే ప్రాంతానికి తీసుకెళ్లి వాస్తవ పరిస్థితిని చూపిస్తామని సవాల్ విసిరారు.
ప్రతిపక్షం రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయ విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని ఆది శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి గౌరవం ఇస్తూనే, ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
