ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్

హైదరాబాద్: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 12న మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించనున్నారు.వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, వ్యవసాయ రంగంపై ప్రభావం, సాగునీరు, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలపైనా సమీక్షించే అవకాశముంది.రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం గుర్తించింది. దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. దీంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పంటల పరిస్థితి, తాగునీటి అవసరాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
కేంద్రానికి రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోసం విజ్ఞప్తి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు మండలాలను ప్రకటించడంతో పాటు, రాష్ట్రానికి తగిన ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరింది.వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణపై సమావేశంలో చర్చించే అవకాశముంది. అలాగే అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణను రూపొందించే అవకాశం ఉంది.వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కీలక రంగాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఈ సమావేశంపై ఆసక్తి నెలకొంది.
#RevanthReddy #ElNino #TelanganaNews #TelanganaPolitics #TelanganaFarmers #DroughtConditions #AgricultureNews #RainfallDeficit #TelanganaGovernment #VSRBreakingNews
