కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణకు సిద్ధమా? రామచంద్ర నాయక్ సవాల్

హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. కేసీఆర్ కుటుంబం అక్రమంగా ఆస్తులు సంపాదించుకుందని, తెలంగాణ ప్రజల సంపదను దోచుకుని తమ ఆస్తులను పెంచుకుందని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులకు దమ్ము, ధైర్యం ఉంటే తమ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1,200 మంది అమరులయ్యారని, ఎంతోమంది ఉద్యమం కోసం తమ ఆస్తులను సైతం కోల్పోయారని రామచంద్ర నాయక్ గుర్తుచేశారు. సకల జనులు ఉద్యమంలో పాల్గొన్నారని, ఉద్యోగ సంఘాలు సమ్మె చేశాయని పేర్కొన్నారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య వంటి వారు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డీఎస్పీ నళిని వంటి వారు తమ పదవులకు రాజీనామా చేశారని తెలిపారు. ఇంతటి త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రమే ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.

కేసీఆర్‌కు 400 ఎకరాల ఫామ్‌హౌస్.. కేటీఆర్‌కు మూడు స్టార్ హోటళ్లు

కేసీఆర్‌కు 400 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందని, కేటీఆర్‌కు మూడు స్టార్ హోటళ్లు ఉన్నాయని, హరీశ్‌రావు, సంతోష్‌రావులకు కూడా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని రామచంద్ర నాయక్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు పెరిగినట్లుగా తెలంగాణ ప్రజల ఆస్తులు ఎందుకు పెరగలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు ఎందుకు అయ్యాయని, ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు మెరుగుపడలేదో బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ఉద్యమ సమయంలో చందాలు వసూలు చేశారని, కూలీ చేసి డబ్బులు సంపాదించామని చెప్పుకున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో సరైన ఇల్లు కూడా లేదని గతంలో చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు మూడు స్టార్ హోటళ్లు ఉన్నాయని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు అనేక రియల్ ఎస్టేట్ సంస్థల్లో వాటాలు ఉన్నాయని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఆస్తులను కప్పిపుచ్చుకునేందుకే

కేసీఆర్ కుటుంబ ఆస్తులు, భూముల వ్యవహారాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని రామచంద్ర నాయక్ వ్యాఖ్యానించారు. తమ ఆస్తుల వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో 17 ఏళ్ల పాటు ప్రతిపక్షంలోనే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రారంభించిన వ్యాపారం ఏమిటో బీఆర్ఎస్ నేతలు చూపించాలని సవాల్ విసిరారు. మెడికవర్ ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకముందే మెడికవర్ ఆస్పత్రి ఉందని, ఆ ఆస్పత్రి తన వాటాను విదేశీ సంస్థకు విక్రయించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు తమ వ్యాపార విస్తరణ కోసం వాటాలను విక్రయించడం సహజమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ఖాతాలోకి రూ.1,200 కోట్లు ఎలా వచ్చాయి?

బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి రూ.1,200 కోట్ల నిధులు ఎలా వచ్చాయని రామచంద్ర నాయక్ ప్రశ్నించారు. ఆస్తుల వ్యవహారాల కోసం సొంత కుటుంబంలోనే గొడవలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ ఆస్తులను కాపాడుకోవడం కోసమే టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారా అని నిలదీశారు.కేసీఆర్ కుటుంబ సభ్యులు మరో పది తరాలు కూర్చుని తినేలా ఆస్తులు సంపాదించుకున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లోని భూములను విక్రయించి ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేసి, పెండింగ్ బిల్లులు చెల్లించకుండా అన్ని వర్గాలకు బకాయిలు పెట్టారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలాఖరు వరకు జీతాలు ఇవ్వని పరిస్థితులు గతంలో ఉన్నాయని విమర్శించారు.

రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీతో ముందుకు వెళ్తున్నాం

తమ ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి అదనపు భారం వేయకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని రామచంద్ర నాయక్ తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, ఏడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిపై సంస్కారహీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే తెలంగాణ పరిస్థితి మరో శ్రీలంకలా మారేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే జుట్టు పన్ను కూడా వేసేవారని ఎద్దేవా చేశారు.

కుంభకోణాలపై విచారణ.. కేసీఆర్ కుటుంబానికి శిక్ష తప్పదు

ఫార్ములా ఈ, కాళేశ్వరం సహా ఇతర కుంభకోణాలపై విచారణ జరుగుతోందని రామచంద్ర నాయక్ తెలిపారు. తమ ముఖ్యమంత్రి చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం చేసిన అక్రమాలపై విచారణకు సిద్ధమా కాదా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.కేటీఆర్, హరీశ్‌రావులు తమ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణకు సిద్ధమై ప్రజలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబానికి చట్టపరంగా శిక్ష పడటంతో పాటు ప్రజా కోర్టులోనూ శిక్ష తప్పదని రామచంద్ర నాయక్ వ్యాఖ్యానించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn