మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్ ప్రారంభం..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) సంయుక్తంగా రూపొందించిన మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, అజారుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆటో ఛార్జీల సవరణకు సంబంధించిన జీవోను కూడా విడుదల చేశారు.సీఎంతో కలిపి మొత్తం 15 మంది మంత్రులు డబ్బులు చెల్లించి వన్ డే ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్‌ను కొనుగోలు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట నుంచి కామన్ పాస్ ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు మెట్రోలో ప్రయాణించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు పట్నం మహేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ సలహాదారు ఎన్‌వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం: పొన్నం ప్రభాకర్

ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం ద్వారా ఆర్టీసీపై పెరిగిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందిని అభినందించారు.గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వరకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కావడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుతాయని తెలిపారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేస్తూ ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.ఫస్ట్ మైల్ – లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఆర్టీసీ, మెట్రోతో పాటు ఆటో రంగాన్ని కూడా ప్రజా రవాణా వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తున్నామని చెప్పారు. ఆటో డ్రైవర్లు ప్రజా రవాణాలో కీలక భాగస్వాములని, వారి సమస్యలు, జీవనోపాధి, సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

ఆటో ఛార్జీల సవరణ.. సంక్షేమ బోర్డు ఏర్పాటు

దాదాపు 12 ఏళ్లుగా పెరగని ఆటో ఛార్జీలపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలన జరిపిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజలపై అదనపు భారం పడకుండా, ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగేలా ఛార్జీలను సవరించినట్లు పేర్కొన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమంతో పాటు ఆటో కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి నెలా రూ.300 కోట్లు విడుదల చేస్తున్నారని, అదనంగా మరో రూ.50 కోట్లు కలిపి మొత్తం రూ.350 కోట్లు నెలకు విడుదల చేయాలని, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరినట్లు మంత్రి వివరించారు.

ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ ప్రయాణం

మెట్రో – ఆర్టీసీ కామన్ పాస్ ద్వారా ప్రయాణికులు ఒకే పాస్‌తో రెండు రవాణా సేవలను వినియోగించుకునే అవకాశం కలుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని రవాణా సేవలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.విజన్ – 2047లో ప్రజా రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, భవిష్యత్ తరాలకు అనుగుణంగా సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో తదితర రవాణా వ్యవస్థలను సాంకేతికతతో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు.ప్రయాణికులకు సులభమైన, సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు రవాణా రంగ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

 

Hashtags: #MetroRTCCommonPass #BhattiVikramarka #PonnamPrabhakar #TelanganaRTC #HyderabadMetro #AutoFareRevision #TelanganaGovernment #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn