కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించిన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని, అక్టోబర్ 5న సీడబ్ల్యూసీ సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందుకు వాటిని సమర్పించనున్నట్లు వెల్లడించారు.పుణేలోని సీడబ్లూపీఆర్‌ఎస్‌లో డిజైన్లపై శాస్త్రీయ నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ అభ్యంతరాలు, నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని పునరుద్ధరణ డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు.మూడు బ్యారేజీల పునాదులను గ్రౌటింగ్‌ ద్వారా బలోపేతం చేయడంతో పాటు స్టిల్లింగ్‌ బేసిన్ల పొడిగింపు, కొత్త కట్‌-ఆఫ్‌ వాల్స్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. పునాదుల స్థిరత్వం, నీటి చొరబాటు నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నవంబర్‌ మధ్య నాటికి మూడు బ్యారేజీల పునరుద్ధరణ పనులు ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.బ్యారేజీల భద్రత, పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ సాంకేతిక సంస్థల సిఫార్సుల మేరకు పనులు చేపడతామని, కఠినమైన నాణ్యతా ప్రమాణాలతో పాటు స్వతంత్ర పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.తాత్కాలిక మరమ్మతులు కాకుండా దీర్ఘకాలం మన్నే విధంగా పునరుద్ధరణ పనులు చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రతి దశను నిపుణుల పరిశీలనకు లోబడి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.పునరుద్ధరణ పనులు పూర్తయి, భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే బ్యారేజీల నిర్వహణ చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn