ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ‘ఆర్యదాన్ ముహమ్మ‌ద్‌’ అవార్డు

* బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్‌-2026కు సీఎం ఎంపిక‌
* కేర‌ళ నిలంబూరులో అవార్డు ప్ర‌దానోత్స‌వం
* రైతు, బీసీ, ప్రజా సంక్షేమ పాల‌న‌కు గుర్తింపు

హైద‌రాబాద్‌: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మక ‘ఆర్యదాన్ ముహమ్మద్ – 2026’ బెస్ట్ ప‌బ్లిక్ స‌ర్వెంట్-2026
(ఉత్తమ ప్రజా సేవకుడు) అవార్డుకు ఎంపిక‌య్యారు. కేరళకు చెందిన దిగ్గ‌జ కాంగ్రెస్ నేత‌, దివంగత ఆర్యదాన్ ముహమ్మద్ స్మారకార్థం ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ఈ పురస్కారాన్ని అందజేస్తోంది. తెలంగాణలో రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, దూరదృష్టి గల నాయకత్వానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు ఫౌండేషన్ వర్కింగ్ ఛైర్మ‌న్‌, నిలంబూర్ ఎమ్మెల్యే ఆర్యదాన్ షౌక‌త్ తెలిపారు.
అవార్డు ఎంపిక‌కు ఎంపీ బెన్నీ బెహన‌న్‌, కేరళ రెవెన్యూ శాఖ మంత్రి ఎ.పి. అనిల్‌కుమార్, ప్రముఖ మేధావి కల్పేట్టా నారాయణన్ జ్యూరీగా వ్య‌వ‌హ‌రించారు. ప్రజాస్వామిక విలువలపై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను ఈ సంద‌ర్భంగా జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది.

ఆర్యదాన్ ముహమ్మద్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని కేరళలోని నిలంబూర్‌లో శుక్ర‌వారం అవార్డును ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ. లక్ష నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేస్తారు. వేడుకలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి. వేణుగోపాల్, ఆర్యదాన్ ముహమ్మద్
స్మారక ఉపన్యాసం చేస్తారు.

ఆర్యదాన్ ముహమ్మద్ కేరళ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌. 8 సార్లు ఎమ్మెల్యేగా, కేర‌ళ‌లోని వివిధ మంత్రివర్గాల్లో నాలుగు సార్లు
వివిధ శాఖలకు మంత్రిగా సేవ‌లు అందించారు. రాజ‌నీతిజ్ఞుడైన ఆర్య‌దాన్ ముహమ్మ‌ద్ దూరదృష్టి గల నేత‌గా, అద్భుతమైన పార్లమెంటేరియన్ గా, సమర్థుడైన పాలకునిగా, కార్మిక వర్గ ఛాంపియన్‌గా కేర‌ళ ప్ర‌జ‌ల మ‌దిలో నిలిచిపోయారు. నిజాయితీ, లౌకిక విలువలు, ప్రజా సంక్షేమ పాలనకు మారుపేరుగా ఆర్యదాన్ ముహమ్మద్ గుర్తింపుపొందారు.

 

#RevanthReddy #CMRevanthReddy #AryadanMuhammedAward #BestPublicServant2026 #Telangana #TelanganaNews #TelanganaPolitics #RevanthReddyAward #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn