22-A భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనుమతులున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్

 

హైదరాబాద్: 22-A సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 118, జీవో 76 తర్వాత 22-A జాబితాలో ఉన్నప్పటికీ చెల్లుబాటు అయ్యే ప్రభుత్వ అనుమతులు కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసింది.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మున్సిపల్ సంస్థల నుంచి చెల్లుబాటు అయ్యే లేఅవుట్, భవన నిర్మాణ, అపార్ట్‌మెంట్ అనుమతులు పొందిన ఆస్తులకు నిర్దేశిత నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఓపెన్ ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనుమతులు పొందిన అనంతరం జరిగిన రిజిస్ట్రేషన్లకు లింక్ డాక్యుమెంట్ తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 22-Aకి సంబంధించిన సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో అదనపు కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్‌తో పాటు హెచ్‌ఎండీఏ, మున్సిపల్, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.

22-Aలో ఉన్న అన్ని భూములను ఒకే గాటన కట్టబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూమి స్వభావం, రికార్డులు, చట్టబద్ధమైన అనుమతులు, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం అర్హమైన సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతామని వెల్లడించారు.

రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లో దాదాపు 64 కాలనీలకు ఈ నిర్ణయంతో ఊరట లభించే అవకాశం ఉంది. జీవో 118కు అనుగుణంగా ఇళ్ల క్రమబద్ధీకరణకు మెమో జారీ చేయగా, సింగరేణి కార్మికుల ఇళ్ల క్రమబద్ధీకరణకు జీవో 76 ద్వారా చర్యలు చేపట్టారు.

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 22-A సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు భూములు, ఇళ్ల సమస్యలపై ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి ముగింపు పలకడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

#Telangana #22ALands #LandRegistration #RevanthReddy #PonguletiSrinivasReddy #GO118 #GO76 #GHMC #HMDA #DTCP #PropertyRegistration #TelanganaNews #HyderabadNews #TelanganaBreakingNews #VSRBreakingNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn