స్కూల్ లో పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి

*విద్యా వికాసం కోసమే “తెలంగాణ పబ్లిక్ స్కూల్స్”*

ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్

తరగతి గదుల్లోనే తెలంగాణ భవిష్యత్

దేశానికి రోల్ మోడల్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం

*ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి*

విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపిండంలో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించి విద్యార్థులకు అంకితమిచ్చారు. తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడలు రంగుల గోడల్లో లేదని, తరగతి గదుల్లోనే ఉందని తాము సంపూర్ణంగా విశ్వసించామన్నారు. అందుకే విద్యాకమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం పాఠశాలలల్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేవలం ఆరుట్ల గ్రామానికి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మాత్రమే స్ఫూర్తి కాదని, తెలంగాణలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరారని, ఒక ప్రభుత్వ పాఠశాలకు నో అడ్మిషన్ బోర్డు పెట్టే పరిస్థితి ఉందంటే విద్యా ప్రమాణాల్లో ప్రభుత్వ చిత్తశుద్ధి ఎలాంటిదో స్పష్టమవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా మెరుగైన విద్యను అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెరిగేందుకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి అభినందించారు.

 

తెలంగాణలో ప్రతీ శాసన సభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని, ఈ స్కూల్స్ ద్వారా వచ్చే ఫలితాలు, సమస్యలను అవగాహన చేసుకుని రాష్ట్రంలో మరిన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటుపై ముందుకు వెళతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారు ఎందరో గొప్ప నాయకులుగా, అధికారులుగా ఎదిగారని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ప్రభుత్వ బడిలో చదువుకున్నవారేనని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నానని గుర్తు చేశారు. తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బ్రతికేలా విద్యార్థులంతా విద్యలో రాణించాలని సూచించారు. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, అధికారులుగా, రాజకీయ నాయకులుగా విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని సీఎం గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫాంతో పాటు కిట్స్ ను అందిచే ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. విద్యార్థుల మధ్య కుల వివక్షను దూరం చేసేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, డిసెంబరు 9 న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించుకోబోతున్నట్లు సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని, ఇందుకోసం విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ నగరానికి తీసుకువచ్చి విద్యార్థులతో ఫుట్ బాల్ ఆడించామని తెలిపారు. దీనిపై కొందరు రాజకీయ విమర్శలు చేశారని, కడుపులో కుల్లు పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్న వాళ్లకు భవిష్యత్ లో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా మిగల్చరని హెచ్చరించారు. విమర్శించే వాళ్లకు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను చూపించాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వానికి అంతా అండగా నిలిస్తే అద్భుతాలని సృష్టిస్తామని, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు, వివిధ కార్పోరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

*హెలిప్యాడ్ నుంచి స్కూల్ బస్సులో…*

తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ బస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. హెలికాఫ్టర్ నుంచి దిగిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి హెలిప్యాడ్ నుంచి స్కూల్ ప్రాంగణం వరకు స్కూల్ బస్సులోనే ప్రయాణించారు. స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న అనంతరం పైలాన్ ఆవిష్కరించి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలతో సంభాషించారు. థాంక్యూ సీఎం అంటూ తనకు స్వాగతం పలికిన విద్యార్థులను ఆప్యాయంగా పలకరించారు.

*పూరీ చేసి.. కిచెన్ ను పరిశీలించి…*

విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన సీఎం, బ్రేక్ ఫాస్ట్ తయారు చేసే కిచెన్ పరిశీలించారు. నేను మీలా పూరీ చేయగలనా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూరీ చేసి వంట చేసే మహిళలతో సరదాగా సంభాషించారు. అనంతరం ప్రీ-ప్రైమరీ తరగతి గదులను సందర్శించి చైల్డ్ లెర్నింగ్ యాక్టివిటీని సీఎం పరిశీలించారు. పాఠశాలలో లైబ్రరీ, తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్‌ ను సందర్శించారు.

 

*జామ మొక్కను నాటిన సీఎం*

తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జామ మొక్కను నాటారు. అనంతరం డాన్స్, మ్యూజిక్ రూమ్ ను సందర్శించి అక్కడి యాక్టివిటీని తెలుసుకున్నారు. అటు నుంచి ఫుట్ బాల్ గ్రౌండ్ కు వెళ్లి విద్యార్థులతో కాసేపు ఫుట్ బాల్ ఆడారు. అనంతరం బహిరంగ సభకు చేరుకుని విద్యార్థులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn