అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం

*అంకురార్పణతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఘట్టాలకు బీజం*

*సెప్టెంబర్ 14న‌ రాత్రి 7 నుండి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం*

తిరుమల : ఈ ఏడాది శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 15వ తేదీ నుండి తిరుమలలో ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి 7గంటల నుండి 8 గంటల మధ్యలో నిర్వహించే అంకురార్పణ ఘట్టంతో ఈ బ్రహ్మోత్సవాలకు బీజం పడనుంది. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ చేపడతారు. నవధాన్యాలను మొలకెత్తించి ఈ భూమండలమంతా పాడిపంటలతో, పశుపక్ష్యాదులతో సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.

*సేనాధిపతి ఉత్సవం*

శ్రీవారిసర్వసైన్యాధ్యక్షుడుశ్రీవిష్వక్సేనులవారిని ఈ సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేపడతారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శ్రీ విష్వక్సేనులవారు ఈ విధంగా మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.

*మేదినిపూజ*

నవధాన్యాలు మొలకెత్తేందుకు అవసరమైన పుట్టమన్ను కోసం ముందుగా భూదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మేదినిపూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు.

*అంకురార్పణ*

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్టమన్ను నింపుతారు. వీటిలో నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఇందులో గోధుమలు – సూర్యుడు, బియ్యం – చంద్రుడు, కందులు – కుజుడు, పెసలు – బుధుడు, శనగలు – బృహస్పతి, అలసందలు – శుక్రుడు, నువ్వులు – శని, మినుములు – రాహువు, ఉలవలు – కేతువుకు సంకేతంగా భావిస్తారు. అలాగే యాగశాలలో ఈ పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానతోపాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

*అక్షతారోపణ*

ఈ పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరిరోజున ఈ మొలలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు. ఈ మొలకలు ఎంత గొప్పగా చిగురిస్తే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా నడుస్తాయి అన్నది భక్తుల విశ్వాసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn