సచిన్ పైలెట్ కొత్త పార్టీ…?
1 min readకాంగ్రెస్ పార్టీ మరో చీలే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ లో ఆ పార్టీ రెండు ముక్కలు కానున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. రాజస్థాన్ మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలెట్ తన దారి తాను చూసుకునేందుకు సిద్దమయ్యారు. సచిన్ పైలెట్ త్వరలోనే సొంత పార్టీని ప్రకటించే సూచనలున్నాయి. ఈ నెల 11న ఆయన పార్టీని ప్రకటించనున్నట్లు రాజకీయవర్గాలు చెపుతున్నాయి. సచిన్ పైలైట్ పార్టీ పెడితే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలున్నాయి. త్వరలో ఎన్నికలు ఎదుర్కొనున్న కాంగ్రెస్ కు సచిన్ ఎపిసోడ్ తీవ్రశరాఘాతంగా మారనున్నది.
రాజస్థాన్ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ , సచిన్ పైలెట్ మధ్య కొంత కాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. గత ఎన్నికల సమయంలో అన్ని తానై సచిన్ పైలెట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం గెహ్లోట్ ను ముఖ్యమంత్రిని చేసింది. సచిన్ పైలెట్ కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చింది. అయితే ఆ తర్వాత వీరి మధ్య తీవ్రవిభేదాలు తలెత్తాయి. దీంతో సచిన్ పైలెట్ తన డిప్యూటీసిఎం పదవితో పాటు పీసీసీ చీఫ్ పదవి కూడా రాజీనామా చేశారు. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో ఆయన దాదాపు 20 రోజులకుపైనే క్యాంప్ పెట్టారు. అశోక్ గెహ్లోట్ ను సిఎం పదవి నుంచి తప్పించాలని సచిన్ అధిష్టానం ముందు డిమాండ్ ఇచ్చారు. అయితే ప్రియాంకగాంధీ నచ్చచెప్పడంతో ఆ తర్వాత పైలెట్ సర్దుకుపోయారు. కాని ఇటీవల మళ్లీ ఆయన అశోక్ గెహ్లోట్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపైన విచారణ జరపడం లేదంటు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన పాదయాత్ర నిర్వహించారు. దీంతో అధిష్టానం కలుగజేసుకుంది. ఇరువురు నాయకులతో పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దాదాపు నాలుగు గంటల పాటు సమావేశం నిర్వహించి సయోధ్య కుదుర్చారు. అయితే ఇది తాత్కాలికమేనని తాజా పరిణామాలతో తేలిపోయింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాజేష్ పైలెట్ కుమారుడే సచిన్ పైలెట్. రాజేష్ పైలెట్ రోడ్డుప్రమాదంలో చనిపోయిన నేపథ్యంలో సచిన్ రాజకీయాల్లోకి వచ్చాడు. గాంధీ కుటుంబానికి పైలెట్ సన్నిహితుడుగా ఉన్నాడు. ప్రధానంగా రాహుల్ గాంధీ టీంలో సచిన్ కీలకంగా వ్యవహారించాడు. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్ ను చేయడంతో రాహుల్ విఫలమయ్యాడు. దీంతో వీరి మధ్య గ్యాప్ పెరిగింది. త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సచిన్ పైలెట్ సొంత పార్టీ ఏర్పాటు చేసుకొని బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నారు. అయితే బలమైన అశోక్ గెహ్లోట్ ను సచిన్ దెబ్బతీయగలరా అన్న దానిపైన సందేహాలున్నాయి. బీజేపీ తెరవెనుక సహకరిస్తే తప్ప సచిన్ పైలెట్ రాజస్థాన్ లో పూర్తి ప్రభావాన్ని చూపించకపోవచ్చు.