అక్కడి నుంచే పోటీ చేస్తా… రేవంత్ రెడ్డి
1 min readపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయబోయేది స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచే బరిలోకి దిగుతానని ఆయన తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం తాను పోటీ చేస్తానని చెప్పారు.ఇతర నియోజకవర్గాల నుంచి ఆహ్వానిస్తున్నప్పటికి తాను మాత్రం కొడంగల్ నుంచి రంగంలో ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గత కొంతకాలంగా రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న దానిపైన చర్చ జరుగుతోంది. ఆయన ఈ సారి కొడంగల్ నుంచి పోటీ చేయరన్న వార్తలు వచ్చాయి. ఎల్.బి.నగర్ తో పాటు పలు నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా పాలకుర్తి నుంచి పోటీ చేయాలని డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి స్వయంగా బహిరంగ సభలో రేవంత్ రెడ్డిని కోరారు. అయితే దీనిపైన ఆయన స్పందించలేదు. పాలకుర్తి ఆహ్వానంతో మరో సారి రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నదానిపైన కథనాలు ప్రారంభమయ్యాయి.
కొడంగల్ లో రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గంగా అందరూ అంచనాలు వేసినప్పటికి ఫలితం తారుమారైంది. టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ రెడ్డి తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్ రెడ్డిని ఓడించాలన్న కేసీఆర్ పట్టుదలతో కొడంగల్ లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యాయి. అయితే తాజాగా కొడంగల్ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.ఇటీవల మూడు రోజుల పాటు అన్ని మండలాల్లో ఆయన సభలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండటంతో పాటు నియోజకవర్గంపైన ఉన్న పట్టు కారణంగా ఈ సారి కొడంగల్ కాంగ్రెస్ లో ఖాతా పడుతుందనే అభిప్రాయం బలంగా ఉంది. గతంలో కొడంగల్ నుంచి రెండు సార్లు రేవంత్ రెడ్డి విజయం సాధించారు. 2009,2014 ల్లో వరసగా తెలుగుదేశం తరుపున ఆయన గెలుపొందారు.