అంటి రాయుడు ఏ పార్టీలోకి..?

1 min read

క్రికెట్ నుంచి ఇటీవలె రిటైర్ అయిన అంబటి రాయుడు రాజకీయ జీవితంపైన చర్చ జరుగుతోంది. ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. అంబటిని చేర్చుకొని పోటీ చేయించడానికి పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేక తెలంగాణ వైపు చూస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంబటి రాయుడు హైదరాబాద్ లోనే పుట్టిపెరిగారు. సిద్దిపేటలో ఆయనకు భూములున్నాయి.

అంబటి రాయుడు తన రిటైర్మెంట్ కొన్ని రోజులు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. దీంతో ఆయన వైసీపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. గుంటూరు ఎంపి లేదా పొన్నూరు ఎమ్మెల్యేగా రాయుడు పోటీ చేస్తారనే ఉహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వైసీపీ నుంచి కాని అంబటి నుంచి కాని ఎలాంటి స్పందన లేదు. రిటైర్ అయిన తర్వాత రాయుడు రాజకీయాలపైన ఏ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు.

ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా రాయుడు కోసం ప్రయత్నిస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఆయన కోరుకున్న చోట సీటు ఇవ్వడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు చెపుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడుని తెలుగుదేశంలోకి తీసుకువస్తే రాజకీయంగా మేలు జరుగుతుందని చంద్రబాబు భావిస్తున్నారట.

మరో వైపు అంబటి రాయుడు మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా ప్రారంభమైంది. అజారుద్దీన్ చొరవతో రాయుడు కాంగ్రెస్ లో చేరనున్నారని చెపుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపిగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. దీంతో ఆయన ఖాళీ చేసే మల్కాజ్ గిరి నుంచి రాయుడుకి అవకాశం ఇస్తారని చెపుతున్నారు. ఆంధ్రా సెటిలర్స్ తో  పాటు అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వారు మల్కాజ్ గిరి లో నివాసం ఉంటున్నారు.అంబటి రాయుడిని బరిలోకి దింపితే వీరంద్దరిని ఆకట్టుకోవచ్చునని కాంగ్రెస్ భావిస్తుందట. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం రాయుడి చేరికపైన నోరువిప్పడం లేదు.

అంబటిరాయుడు 1985లో జన్మించాడు.  దుందుడుకు స్వభావం కల్గిన అంబటి క్రికెట్ లో అనేక ఆటుపోట్లను చవిచూశాడు.బీసీసీఐ తో వివాదం కారణంగా ఐసీఎల్ లో ఆడి భారత క్రికెట్ నుంచి నిషేదానికి గురయ్యాడు. అయితే ఆ తర్వాత బీసీసీఐతో రాజీపడి వెనక్కి వచ్చాడు. నిలకడలేని ఆటతీరు కారణంగా భారత్ క్రికెట్ జట్టులో ఎక్కువ కాలం కెరీర్ ను కొనసాగించలేకపోయాడు. ఐపిఎల్ లో మాత్రం ముంబయి ఇండియన్స్, చైన్నై జట్టుకు వరసగా ఆడుతూ వచ్చాడు. ఒకటి రెండు సార్లు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి ఆ తర్వాత వెనక్కి తీసుకున్నాడు. ముక్కుమీద కోపంతో ఉండే రాయుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో రాయుడు మీడియా ముందుకు రావడానికి ఏ మాత్రం ఇష్టపడరు. బయట కార్యక్రమాల్లో కూడా అరుదుగా కనిపిస్తుంటారు. రాయుడు మైక్ పట్టుకొని మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి స్వభావం కల్గిన అంబటి రాయుడు రాజకీయాల్లో రాణించడం అంటే కష్టమేనని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn