మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ లీగల్ నోటీసులు

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారు. మర్రి శశిధర్ రెడ్డి ఇటీవలె కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైన ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు క్యాన్సర్ వచ్చిందన్న ఆయన ఇక భవిష్యత్తు లేదని తేల్చారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కుమారుడైన శశిధర్ రెడ్డి వైఖరీపైన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇంత కాలం పార్టీలో పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీకి రాజీనామా చేయడంపైన వారు నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలపైన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పైన చేసిన వ్యాఖ్యల మీద ఆయనకు లీగల్ నోటీస్ పంపారు. పీసీసీ అధ్యక్షుడి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఆరోపణలపైన క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని లేఖలో స్పష్టం చేశారు.