సీఎం రేవంత్ రెడ్డి మానవత్వం
1 min read
కండరాల వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకోలేకపోతున్న నిరుపేద యువకుడు రాకేష్ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలించిపోయారు. తక్షణమే రాకేష్ కు కావాల్సిన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా వైద్యం అందించడం తో పాటు రాకేష్ కోసం ఛార్జింగ్ వాహనాన్ని కూడా అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు రాకేష్ కుటుంబీకులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం తరఫున హామీ ఇచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్య పల్లి గ్రామానికి చెందిన గూళ్ల రాకేష్ చాలా కాలం సూడో మస్య్కులర్ డిస్ట్రోఫీ అనే కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల వ్యాధి తీవ్రత పెరగడం తో నడవలేని పరిస్థితికి వచ్చాడు. అయితే రాకేష్ కు ఆరోగ్యం మెరుగు కావాలంటే ఖరీదైన ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదరికంలో ఉన్న రాకేష్ కుటుంబం ఖరీదైన వైద్యం చేయించలేకపోతుందని, పత్రికలో వచ్చిన కథనంపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ములకనూరు లోని ఓ ప్రైవేటు కాలేజీలో రాకేష్ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామం నుంచి ములకనూరు వెళ్లి రావడానికి చార్జింగ్ వెహికల్ ను కూడా ప్రభుత్వం అందించనున్నది. తమ బిడ్డను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాకేష్ తల్లిదండ్రులు గూళ్ల సమ్మయ్య, లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.