జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

1 min read

భూ భార‌తిపై క్షేత్ర స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాలి…

* ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి…
* ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి…
* వేస‌విలో తాగు నీటి స‌మ‌స్య రాకుండా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు ఉండాలి..
* జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి దిశానిర్దేశం….

హైద‌రాబాద్‌: రైతుల భూ స‌మ‌స్య‌ల శాశ్వ‌త ప‌రిష్కార‌మే ధ్యేయంగా ఎంతో అధ్య‌య‌నంతో తీసుకువ‌చ్చిన భూ భార‌తి చ‌ట్టాన్ని క్షేత్ర స్థాయికి స‌మర్థంగా తీసుకెళ్లాల‌ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ముఖ్య‌మంత్రి ఏ. రేవంత్ రెడ్డి
సూచించారు. ఇందుకు ప్ర‌తి మండ‌లంలో స‌ద‌స్సు నిర్వ‌హించాల‌ని, ప్ర‌తి క‌లెక్ట‌ర్ మండ‌ల స్థాయి స‌ద‌స్సుల‌కు హాజ‌రై అక్క‌డ రైతులు, ప్ర‌జ‌లు లేవ‌నెత్తే సందేహాల‌కు వారికి అర్ధ‌మ‌య్యే భాష‌లో వివ‌రించి ప‌రిష్కారం చూపాల‌న్నారు. హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థలో (ఎంసీహెచ్ఆర్‌డీ) సోమ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇళ్లు, వేస‌వి తాగు నీటి ప్ర‌ణాళిక‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. భూ భార‌తి, ఇందిర‌మ్మ ఇళ్ల‌ను తాము ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నామ‌ని, ఈ రెండింటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ల‌డంలో క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. భూ భార‌తి చ‌ట్టాన్ని క‌లెక్ట‌ర్లు స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అన్నారు. గ‌తంలో రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారాన్ని ప‌ట్టించుకోకుండా రైతుల‌ను న్యాయ‌స్థానాల‌కు పంపార‌ని.. భూభార‌తి చ‌ట్టంలో రెవెన్యూ యంత్రాగ‌మే ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తుంద‌ని… అప్పీల్ వ్య‌వ‌స్థ ఉన్న విష‌యాన్ని రైతులు, ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించాల‌ని సీఎం తెలిపారు. భూ భార‌తి పైలెట్ ప్రాజెక్టు స‌ద‌స్సుల‌ను నారాయ‌ణ‌పేట జిల్లా మ‌ద్దూర్‌, ఖ‌మ్మం జిల్లా నేల‌కొండ‌ప‌ల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట‌, ములుగు జిల్లా వెంక‌టాపూర్ మండ‌లాల్లో నిర్వ‌హిస్తార‌ని, ఆయా మండ‌ల కేంద్రాల్లో స‌ద‌స్సుల‌కు క‌లెక్ట‌ర్లు క‌చ్చితంగా హాజ‌రుకావాల‌ని, ఆయా మండ‌లాల్లో ప్ర‌తి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా స‌ద‌స్సుల‌కు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, ఇత‌ర మంత్రులు హాజ‌రువుతార‌ని సీఎం తెలిపారు.

* ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికో ప్ర‌త్యేకాధికారి నియామ‌కం….

ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాన్ని త‌మ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. గ్రామ స్థాయిలో ఇందిర‌మ్మ ఇళ్ల క‌మిటీలు ఆమోదం పొందిన జాబితాను మండ‌ల స్థాయి క‌మిటీలు ప‌రిశీలించాల‌ని సీఎం సూచించారు. ఆ క‌మిటీల ప‌రిశీల‌న అనంత‌రం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి పంపాల‌ని.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖ‌రార‌వుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.. ఈ వ్య‌వ‌హారం స‌క్ర‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక అధికారిని నియ‌మించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈ ప్ర‌త్యేకాధికారి ఇందిర‌మ్మ క‌మిటీలు, మండ‌ల క‌మిటీలు, క‌లెక్ట‌ర్లు, ఇన్‌ఛార్జి మంత్రి మ‌ధ్య స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉంటార‌ని సీఎం తెలిపారు. గ‌తంలో ఉమ్మ‌డి జిల్లాకు నియ‌మించిన సీనియ‌ర్ అధికారులు ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణాల‌పై దృష్టి సారించాల‌ని, ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సీఎం సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ ద‌శ‌లోనూ ఎవ‌రూ ఎటువంటి ఒత్తిళ్ల‌కు త‌లొగొద్ద‌ని, ఎక్క‌డైనా అన‌ర్హుల‌కు ఇళ్లు కేటాయిస్తే మండ‌ల స్థాయి క‌మిటీ, ప్ర‌త్యేకాధికారిపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జ‌నాభా ప్రాతిప‌దిక‌న‌, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాల‌ని, ఈ విష‌యంలో హేతుబ‌ద్ధ‌త పాటించాల‌ని సీఎం సూచించారు. నిర్దేశిత స‌మ‌యం ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు సాగించాల‌ని, ఇందుకు క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని సీఎం ఆదేశించారు.

* ఎక్క‌డా తాగు నీటి స‌మ‌స్య రావ‌ద్దు….

వేస‌వి కాలంలో ఎక్క‌డా తాగు నీటి స‌మ‌స్య త‌లెత్త‌కుండా క‌లెక్ట‌ర్లు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల‌ని ముఖ్య‌మంత్రి ఏ.రేవంత్ రెడ్డి సూచించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో నీటి పారుద‌ల శాఖ‌, తాగు నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌, విద్యుత్ శాఖ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని ముఖ్యమంత్రి అన్నారు. క‌లెక్ట‌ర్లు సైతం డ్యాష్ బోర్డు ద్వారా ప్ర‌తి గ్రామంలో తాగు నీటి వ‌న‌రులు, స‌ర‌ఫ‌రాపై ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని సూచించారు. ఎక్క‌డైనా స‌మ‌స్య త‌లెత్తితే ఎలా ప‌రిష్క‌రించాల‌నే దానిపై ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక ఉండాల‌ని సీఎం అన్నారు. ప‌లు గ్రామాల‌కు తాగు నీటి స‌ర‌ఫ‌రా పైపులైను వ్య‌వ‌స్థ లేద‌ని, ప‌లు ఇళ్ల‌కు న‌ల్లాలు లేవ‌ని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగు నీటి స‌మ‌స్య రాకుండా చూడాల‌ని సీఎం అన్నారు. కోయ గూడేలు, చెంచు పెంట‌లు, ఇత‌ర గిరిజ‌న ప్రాంతాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ద పెట్టాల‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా పైపులైన్లు, మోటార్ల మ‌ర‌మ్మ‌తులు, బోర్ల రిపేర్ల‌కు సంబంధించి క‌లెక్ట‌ర్లకు ఇప్ప‌టికే నిధులు కేటాయించామ‌ని, అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని నిధులు కేటాయిస్తామ‌ని సీఎం తెలిపారు. హైద‌రాబాద్‌తో పాటు ఇత‌ర కార్పొరేష‌న్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో తాగు నీటి స‌ర‌ఫ‌రా మోటార్లు కాలిపోయిన‌ప్పుడు, లేదా ఇత‌ర సాంకేతిక స‌మ‌స్య‌లు తలెత్తిన‌ప్పుడు క‌లెక్ట‌ర్లు వెంట‌నే సీఎస్‌కు స‌మాచారం అంద‌జేయాల‌ని, వాటిని యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించే ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు, కొండా సురేఖ‌, పొన్నం ప్ర‌భాక‌ర్, జూప‌ల్లి కృష్ణారావు, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేశ‌వ‌రావు, ష‌బ్బీర్ అలీ, ఆయా శాఖ‌ల ఉన్న‌తాధికారులు, జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn