అరకోటి సభ్యత్వం
1 min read
వి.ఎస్.ఆర్,ఎడిటర్
తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది. గత కొంత కాలంగా నిస్తేజంగా ఉన్న పార్టీలో మెంబర్ షిప్ డ్రైవ్ కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేదంటు ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం పటాపంచలు అవుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో సభ్యత్వం పరుగులు పెడుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగా నాయకులు, కార్యకర్తలు స్పందించడంతో కాంగ్రెస్ మెంబర్ షిప్ అరకోటికి చేరువవుతోంది . నిర్దేశించుకున్న 30లక్షల సభ్యత్వాన్ని అరవై రోజుల్లోనే పార్టీ శ్రేణులు పూర్తి చేశాయి. నియోజకవర్గాల్లో నాయకులు పోటీపడటంతో కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. గతంలో మాదిరి కాకుండా ఈ సారి డిజిటల్ మెంబర్ షిప్ ఇస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఇక నల్గొండ పార్లమెంటు పరిధిలో పార్టీ అత్యధిక మెంబర్ షిప్ చేయించింది. ఇక్కడ పార్టీ పటిష్టంగా ఉండటంతో పాటు సీనియర్ నాయకులంతా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో సభ్యత్వం పెద్దఎత్తున జరిగింది. స్థానిక ఎంపి ,మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మెంబర్ షిప్ డ్రైవ్ పైన ద్రుష్టి సారించారు. ఇక మంచిర్యాల అసెంబ్లీ పరిధిలో లక్షపైగా సభ్యత్వం జరగడం విశేషం. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఇక్కడ ఇంఛార్జిగా వ్యవహారిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక మెంబర్ షిప్ అయిన అసెంబ్లీ నియెజకవర్గం ఇదే కావడం విశేషం. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ లో డా లక్ష సభ్యత్వాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. చాలా నియోజకవర్గాల్లో 50 నుంచి 70 వేల మధ్య సభ్యత్వం నమోదైంది. మెంబర్ షిప్ లో యాక్టివ్ గా పాల్గొన్న వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. టిక్కెట్ల కేటాయింపులో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పరోక్షంగా చెప్పడంతో నాయకుల మధ్య పోటీ నెలకొన్నది. దీనికి తోడు రెండు లక్షల రూపాయల భీమా కల్పించడం కోసం కార్యకర్తల్లో ఉత్సాహానికి కారణమైంది. మొత్తానికి కాంగ్రెస్ లో సభ్యత్వ నమోదు సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతాలు వస్తున్న సమయంలో సంస్థాగతంగా రూపు రేఖలు సంతరించుకోవడానికి మెంబర్ షిప్ పార్టీకి ఉపయోగపడనున్నది.