హుజూరాబాద్ ఉప ఎన్నికకు మోగిన నగారా
1 min read
హుజూరాబాద్ ఉప ఎన్నికకు నగారా మోగింది. బై ఎలక్షన్ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 30 హుజూారాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నది. నవంబర్ 2న కౌటింగ్ నిర్వహిస్తారు. అక్టోబర్ 1న ఈసీ నోటిఫికేషన్ ను ప్రకటించనున్నది. 8వ తేదీ వరకు నామిషనేన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ ఉప ఎన్నిక కూడా అక్టోబర్ 30నే జరగనున్నది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రస్తుతం ఆయన బీజేపీ తరుపున మళ్ళీ పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ తరుపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తన అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాతకంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈటెల రాజేందర్ ను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా టీఆర్ఎస్ ముఖ్యనేతలు హుజూరాబాద్ లో మోహరించారు. మంత్రి హరీష్ రావు నాయకత్వంలో గులాబీ దళం నియోజకవర్గంలో పనిచేస్తోంది. ఇటీవల కాలంలో కోట్లాది రూపాయల అభివ్రుద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ఇక్కడ అమలు చేసింది. కులసంఘాలతో టీఆర్ఎస్ భారీ సమావేశాలను ఏర్పాటు చేసి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఇదే సమయంలో దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో వందశాతం అమలు చేసింది. నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు పదిలక్షల రూపాయల చొప్పున అందజేసింది.
మరో వైపు నియోజకవర్గంలో పట్టునిలబెట్టుకోవడానికి ఈటెల రాజేందర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరసగా ఇక్కడి నుంచి విజయం సాధిస్తున్న వస్తున్న ఆయనకు ఈ సారి మాత్రం అగ్ని పరీక్షే ఎదురైంది. టీఆర్ఎస్ నుంచి గట్టి సవాల్ ను ఎదుర్కొంటున్నారు. ఇంత కాలం పాటు ఈటెల రాజేందర్ కు అండగా నిలిచిన ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం ఆయనకు దూరమైంది. కేవలం కార్యకర్తల బలంతోనే ఆయన నెట్టుకొస్తున్నారు. నాయకులు లేకపోయినా నియోజకవర్గ ప్రజల తనకు అండ ఉంటారని ఈటెల విశ్వసిస్తున్నారు. బీజేపీ నాయకత్వం ఆయనకు పూర్తి మద్దతునిస్తోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నికపైన అంత ఆసక్తి చూపించడం లేదు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరులో తనకు అవకాశం లేదని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కౌషిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ పరిస్థితి ఇక్కడ ఆగమ్యగోచరంగా మారింది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తున్నప్పటికి ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడు ఆమె పోటీ చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.
మొత్తానికి హుజూరాబాద్ ఉప ఎన్నిక మరో సారి తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారనున్నది.ఈ బై ఎలక్షన్ రిజల్ట్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలను తారుమారు చేసే ఛాన్స్ కూడా ఉంది.