టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి అనుచరుడు
1 min readహుజూరాబాద్ ఉప ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈటెల రాజేందర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్ కేడర్ పైన గులాబీ పార్టీ కన్నేసింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను తమ వైపు తిప్పుకోవడం ద్వారా టీఆర్ఎస్ లో వచ్చిన చీలికను భర్తీ చేయాలని కేసీఆర్ టీం భావిస్తోంది. అందులో భాగంగా రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన ముద్దసాని కశ్యప్ రెడ్డిని పార్టీలో చేర్చుకుంది. మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కశ్యప్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డి. దామోదర్ రెడ్డి టీడీపీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. అనారోగ్య కారణాలతో చనిపోవడంతో కశ్యప్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం తరుపున ఆయన రెండు సార్లు హుజూరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సమయంలో కశ్యప్ కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే హుజూరాబాద్ లో పాడి కౌషిక్ రెడ్డి యాక్టివ్ గా ఉండటం , గత ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ రావడంతో కశ్యప్ రెడ్డి నిరుత్సాహంగా ఉన్నారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా కౌషిక్ రెడ్డికే టిక్కెట్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.