Reventh Reddy Bio| Unknown secrets about Revanth
1 min readతెలుగు రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పేరు తెలియని వాళ్లుండరు. పాలిటిక్స్ లోకి వచ్చిన పదేళ్లలోనే ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న ఆయన ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్. కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా రేవంత్ రెడ్డి మారిపోయారు. పాలక పక్షం మీద తనదైన శైలిలో విరుచుకుడే ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన అభిమానులున్నారు. రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డి స్పీచ్ లకు జనం ఫిదా అవుతుంటారు. అలాంటి రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రస్తానం ఏమిటన్న దానిపైన నిత్యం అనేక మంది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు..? కుటుంబ నేపథ్యం ఏమిటీ…? వంటి ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతుంటారు.
అయితే రేవంత్ రెడ్డి వ్యక్తిగత జీవితంలో అనేక మలుపులున్నాయి. సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన రాష్ట్రంలోనే ముఖ్యమైన రాజకీయ నాయకుడిగా ఎదగడం వెనుక చాలా కథే ఉంది. ప్రధానంగా ఆయన పెళ్లి కథలో కూడా మంచి లవ్ స్టోరీ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లి రేవంత్ రెడ్డి సొంత గ్రామం. మంచి భూస్వామ్య కుటుంబమై అయినప్పటికి రేవంత్ రెడ్డి ఊహతెలిసే నాటికి ఆర్థికంగా చితికిపోయారు.
దీంతో బాగా చదువుకొని కుటుంబానికి అండగా నిలబడాలన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండేవారట.అయితే ఇంటర్ చదువుతున్న సమయంలోనే రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారు. తన స్నేహితుడికి సమీప బంధువైన గీతను చూసినప్పుడే ఫిదా అయిపోయాడట. తనను పరిచయం చేసుకోవడానికి ఏకంగా ఆమెకు న్యూ ఇయర్ గ్రీటింగ్ పంపించాడట. అయితే ఆ కార్డు ఆమె తండ్రికి చేతికి చిక్కింది. దీంతో రేవంత్ ఎవరని గీతను ఆయన నిలదీశారట. ఆ తర్వాత రేవంత్ రెడ్డి స్నేహితుడి ఇంట్లో తరుచు వీరు కలుసుకునే వారు. అయితే ప్రత్యేకంగా వీరి మధ్య ఎలాంటి లవ్ ప్రపోజల్ లేదట. సినిమా టిక్ లో ఐలవ్ యులు చెప్పుకోవడం అలాంటి జరగకుండానే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
అయితే ఇంటర్ అయ్యాక రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో డిప్లమా ఇన్ పెయింటింగ్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. త్వరగా ఏదో ఒక ఉద్యోగంలో చేరాలని ఆరాటపడ్డ ఆయనకు విజయవాడలో ఆర్టిస్టుగా జాబ్ వచ్చింది. చతుర, విపుల పబ్లిషర్స్ లో ఉద్యోగం వచ్చినా విజయవాడలో పోస్టింగ్ ఇవ్వడంతో అక్కడికి వెళ్లలేదు. కేవలం గీత కోసమే రేవంత్ రెడ్డి ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడట. ఆ తర్వాత యాడ్ ఎజెన్సీతో పాటు ప్రింటింగ్ ప్రెస్ పెట్టిన రేవంత్ రెడ్డి గోడలపైన వాల్ రైటింగ్ చేసేవాడు. అయితే ఈ సమయంలోనే ఆయన ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. అమ్మ,నాన్నలను ఒప్పించగలనన్న నమ్మకం ఉంటేనే ప్రేమించమని రేవంత్ రెడ్డి పెద్దన్నయ్య గీతకు స్పష్టం చేశారట.
ఇదే సమయంలో గీత వాళ్లింట్లో వీరి ప్రేమ విషయం తెలిసి ఆమెపైన తీవ్రంగా కోపడ్డారు. రేవంత్ తో మాట్లాడవద్దని ఆమెపైన ఆంక్షలు విధించారు. అయితే గీత వాళ్ల మాటలను వినకపోవడంతో డిగ్రీ కోసం ఆమెను బలవంతంగా ఢిల్లీకి పంపించారు. అక్కడ మాజీ కేంద్ర మంత్రి , తన పెద నాన్న అయిన జైపాల్ రెడ్డి ఇంట్లో ఉండి రెండేళ్ల పాటు ఆమె చదువుకున్నది. అయితే గీతను కలవడం కోసం రేవంత్ రెడ్డి చాలా సార్లు ఢిల్లీకి వెళ్లాడట. అక్కడికి వెళ్లడానికి ఛార్జీలకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తరుచుగా ఉత్తరాలు కూడా రాసుకునే వాళ్లు. గీత డిగ్రీ ఫైనలియర్ లో ఉన్న సమయంలో ఆమెకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పట్టారు. అయితే తాను రేవంత్ రెడ్డినే చేసుకుంటానని తేల్చి చెప్పడంతో అంతా గట్టిగా వ్యతిరేకించారు. రేవంత్ లాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేమిటని వారు అడ్డుపడ్డారు. అయితే గీత పట్టుదల చూసిన పెద్దనాన్న జైపాల్ రెడ్డి వీరి పెళ్లికి అందరిని ఒప్పించారు.
రెండు కుటుంబాల ఆశీస్సులతో వీరు 1992లో ఒక్కటయ్యారు. గీతను పెళ్లి చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డికి అద్రుష్టం బాగా కలిసి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన పట్టిందల్లా బంగారమైంది. రాజకీయాల్లో కూడా అనుకూలించడంతో అనతి కాలంలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగారు. అయితే గీతకు మాత్రం రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్లడం అస్సలు ఇష్టం లేదట. ఇప్పటికీ కూడా ఆమెలో పాలిటిక్స్ అంటే భయమే ఉంది. అయినప్పటికి రేవంత్ రెడ్డి ఇష్టానికి ఆమె ఎప్పుడు ఎదురు చెప్పలేదు. రాజకీయంగా ప్రత్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నప్పటికి అన్ని సమయాల్లో ఆమె రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు.