ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. తెలంగాణ వైపు.. ప్రపంచం చూపు

తెలంగాణను ప్రపంచంలోనే పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం మరో భారీ సదస్సుకు సిద్ధమైంది. గతేడాది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన ప్రభుత్వం ఈసారి మరింత విస్తృతంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ను నిర్వహించనుంది.డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణం ఇందుకు వేదిక కానుంది. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు ఈ సదస్సుకు తరలిరానున్నారు.రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపన, యువతకు ఉద్యోగాల కల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది తెలంగాణ రైజింగ్ విజన్–2047లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే సంకల్పం దిశగా ఈ సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది.రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించటంతో పాటు ఇప్పటికే పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీలు తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు అవసరమైన సహకారం అందించనున్నారు.
ఈసారి భారీ విస్తీర్ణంలో
గతేడాది 27,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించగా, ఈసారి 80 వేల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
గతేడాది ఒకే ఎక్స్‌పో హాల్ ఉండగా ఈసారి ఆరు భారీ ఎక్స్‌పో హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు.ప్రదర్శనశాలల విస్తీర్ణం 3,200 చదరపు మీటర్ల నుంచి 60,600 చదరపు మీటర్లకు పెరిగింది. ప్రధాన సదస్సు వేదికను 10 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో సిద్ధం చేస్తున్నారు.తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, పారిశ్రామిక ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే 1,300 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు సదస్సుకు హాజరయ్యేందుకు అంగీకారం తెలిపారు. వీరిలో 220 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులున్నారు. వివిధ రంగాలకు చెందిన 1,059 కంపెనీలు ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి.
ఒకే వేదికపై 7 మెగా ఈవెంట్లు
రక్షణ రంగానికి సంబంధించి రక్షా ఎక్స్‌పో, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్, యువ పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలతో స్టార్టప్ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు క్లైమేట్ కాన్‌క్లేవ్, ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్, ట్రైబల్ సమ్మిట్, తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు.ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రదర్శనశాలలు ఉంటాయి.పెద్ద కంపెనీలతో పాటు చిన్న పరిశ్రమలు, స్టార్టప్‌లకు అంతర్జాతీయ సంస్థలతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం లభించనుంది.మూడు రోజుల సదస్సులో వివిధ అంశాలపై 77 సమావేశాలు నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు, పెట్టుబడుల ఒప్పందాలు, కొత్త పారిశ్రామిక విధానాల ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రజల సందర్శనకు అవకాశం
ఈసారి గ్లోబల్ సమ్మిట్‌ను కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకే పరిమితం చేయకుండా ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రధాన సదస్సు జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 13 వరకు రక్షా ఎక్స్‌పో, ఇండియాజాయ్ ప్రదర్శనలను ప్రజలు సందర్శించే అవకాశం కల్పించనున్నారు.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ విభాగాలకు పది కమిటీలను ఏర్పాటు చేశారు. అదనంగా 144 మంది గ్రూప్–1, 141 మంది గ్రూప్–2 ప్రొబేషనరీ అధికారులను ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది.
#InvestTelangana #TelanganaGlobalSummit2026 #TelanganaRising #FutureCity #CMRevanthReddy #Hyderabad #TelanganaNews #TodaysBreaking #ఇన్వెస్ట్_తెలంగాణ #తెలంగాణ
