విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు.. సీఎం రేవంత్ రెడ్డి

*విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు*
* వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి విధానం…
* బోధన సిబ్బంది ప్రయోజనాలకు భంగం కలగనివ్వం
* విద్యా సంస్థల్లో మౌలిక వసతులకు పెద్దపీట
* యూనివర్సిటీ బోధనా సిబ్బంది నియామకాల ప్రక్రియ వేగవంతం
* విద్యా శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్: విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు నాణ్యమైన విద్యా బోధన ద్వారా, ఆధునిక ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విద్యా శాఖపై ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచి 12వ తరగతి వరకు విధానాన్ని అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ప్రగతిని అధికారులు వివరించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 12వ తరగతి వరకు విద్యార్థులను భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. 12 వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులోని నిపుణులుగా మారేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాలన్నారు.
పదో తరగతి తర్వాత సగటున 40 శాతం మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, అందులో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 12వ తరగతి వరకు కొనసాగింపు ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్ సంఖ్య చాలా స్వల్పంగా ఉంటోందన్నారు. దేశంలో 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విధానమే అమల్లో ఉందన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్ బెనిఫిట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని సీఎం అన్నారు. ఆయా వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూళ్లను పూర్తి వసతులతో నిర్మించడానికి అవసరమైన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వాటి నిర్మాణాలకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లు, రెసిడెన్షియల్స్ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించాలని, వాటికి పూర్తి స్థాయిలో నీటి వసతి కల్పించాలని సీఎం ఆదేశించారు.
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (YIIRS) నిర్మాణ పురోగతిపై సీఎం సమీక్షించారు. YIIRS నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశిత సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆయా స్కూళ్లలో ల్యాండ్ స్కేపింగ్ ఏర్పాటు, ఇంటీరియర్, డిజిటల్ పరికరాలు, క్రీడా పరికరాలు, కిచెన్ సామగ్రి సేకరణకు సంబంధించి అత్యుత్తమ సంస్థలను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదశలోనూ నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు.
క్యూర్ పరిధిలో నిర్మిస్తున్న స్కూళ్ల నిర్మాణ ప్రగతిపైనా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఆయా స్కూళ్ల నిర్మాణాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్ చేసిన తర్వాత విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగాలు లభించాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలిటెక్నిక్‌ల అప్‌డేట్‌కు అవసరమైన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో శాఖపరమైన ఇబ్బందులు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
#CMRevanthReddy #RevanthReddy #TelanganaEducation #EducationReforms #StudentWelfare #TelanganaGovernment #TelanganaNews #EducationDevelopment #StudentsBenefits #VSRBreakingNews
