ఎల్‌నినో వచ్చినా.. విద్యుత్ కొరత రాకుండా పటిష్ట చర్యలు..డిప్యూటీ సీఎం భట్టి

*ఎల్‌నినో వచ్చినా.. విద్యుత్ కొరత రాకుండా పటిష్ట చర్యలు*
*రోజువారీ విద్యుత్ ఉత్పత్తిని 140 మిలియన్ యూనిట్లకు పెంచాలి*
*యాదాద్రి ప్లాంట్‌లో రెండు యూనిట్లకు కోల్ ఇండియా నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరా*
*మూతపడిన పరిశ్రమల విద్యుత్ బకాయిల చెల్లింపులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం*
*విద్యుత్ బకాయిల పరిష్కారానికి వెసులుబాటు కల్పించేలా డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు*
*థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, సరఫరాపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు*
హైదరాబాద్ : ఎల్‌నినో ప్రభావంతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం, రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రానున్న రబీ, వేసవి సీజన్లలో వ్యవసాయ, గృహ విద్యుత్ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని రోజుకు 140 మిలియన్ యూనిట్లకు పెంచేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో గురువారం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, బకాయిల అంశాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రోజువారీ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సగటున 91 మిలియన్ యూనిట్లకు చేరిందని, ఇటీవల ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైందని అధికారులు వివరించారు. ఈ స్థాయి నుంచి ఉత్పత్తిని మరింత పెంచి రోజుకు 140 మిలియన్ యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లకు బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి ప్రత్యామ్నాయ బొగ్గు సరఫరా అనుసంధానాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మార్గం ద్వారా బొగ్గు సరఫరా నవంబర్ నుంచి ప్రారంభం అవుతుందని వెల్లడించారు.
విద్యుత్ ఉత్పత్తి పెంపులో భాగంగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ‘‘ఈ కేంద్రంలోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఐదో యూనిట్‌ను ఈ నెల 20న గ్రిడ్‌కు అనుసంధానించామని, మిగిలిన సాంకేతిక, నిర్వహణపరమైన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, ఐదో యూనిట్‌ను పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాల్లోకి తీసుకువస్తున్నామని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ‘‘టీజీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల రోజు వారీ సగటు ఉత్పత్తి 2024-25 సంవత్సరంలో 65.90 మిలియన్ యూనిట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 76.46 మిలియన్ యూనిట్లు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 21 నాటికి 90.97 మిలియన్ యూనిట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రోజుకు 14.51 మిలియన్ యూనిట్ల మేర, సుమారు 19 శాతం పెరుగుదల నమోదైంది. అక్టోబర్ 16న ఒక్కరోజులో 118 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి’’ జరిగిందని అధికారులు తెలిపారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని అన్ని యూనిట్లు గరిష్ఠ సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను పెంచాలని, ఉత్పత్తిని రోజువారీ సమీక్షిస్తూ లక్ష్య సాధన దిశగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని భట్టి విక్రమార్క ఆదేశించారు.
మూతపడిన పరిశ్రమల విద్యుత్ బకాయిల చెల్లింపులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బకాయిల చెల్లింపుల విషయంలో వన్‌టైమ్ సెటిల్మెంట్ విధానం ద్వారా బకాయిల చెల్లింపును సులభతరం చేసి, వినియోగదారులకు ప్రయోజనం కలిగించేలా సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మూతపడిన పరిశ్రమల యాజమాన్యాలతో సమన్వయం చేసుకొని, విద్యుత్ బకాయిల పరిష్కారానికి అందుబాటులో ఉన్న అవకాశాలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని TGSPDCL, TGNPDCL సీఎండీలను డిప్యూటి సిఎం ఆదేశించారు. ఈ విధానం ద్వారా అర్హత కలిగిన పరిశ్రమలకు బకాయిల చెల్లింపుల్లో కొంతమేర వెసులుబాటు లభించడంతో పాటు, విద్యుత్ పంపిణీ సంస్థలకు దీర్ఘకాలిక బకాయిల వసూళ్లకు అవకాశం కలుగుతుందన్నారు. అలాగే సింగరేణి, జెన్కో, ట్రాన్స్‌కో తదితర సంస్థలకు వివిధ విభాగాల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. రానున్న రోజుల్లో విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా దానికి అనుగుణంగా ఉత్పత్తి, ప్రసారం, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
#ElNino #BhattiVikramarka #Telangana #TelanganaNews #PowerSupply #Electricity #PowerShortage #TelanganaGovernment #BreakingNews #VSRBreakingNews
