ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఎల్‌నినో పరిస్థితుల ప్రభావంతో భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్ర సంక్షోభం ఎదురయ్యే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.అధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. సమస్య తీవ్రతరం అయిన తర్వాత స్పందించడం కాకుండా, ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని సీఎం పేర్కొన్నారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేకపోవడం సవాలుగా మారే అవకాశం ఉందని వివరించారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.విద్యుత్ వినియోగం అధికంగా ఉండే పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.

కోవిడ్ తరహాలో సమగ్ర కార్యాచరణ

కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలో ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలని సూచించారు.సినిమా, మీడియా, కళాజాతలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నీటి కొరత తీవ్రతరం కాకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ప్రతి చుక్క నీటిని జాగ్రత్తగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.రాబోయే నెలల్లో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ అవసరాల నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn