ఈనాడు వార్తపై కేటీఆర్ లీగల్ నోటీసు.. 48 గంటల్లో ఉపసంహరణకు డిమాండ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని కోర్టు ఆదేశించినట్లు ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్తపై కేటీఆర్ తరఫున లీగల్ నోటీసు జారీ అయింది. సెప్టెంబర్ 29న ప్రచురితమైన ఆ వార్త వాస్తవాలకు విరుద్ధంగా, పాఠకులను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని న్యాయ నోటీసులో పేర్కొన్నారు.కేటీఆర్ తరఫు న్యాయవాది ఎన్. లలితారెడ్డి సెప్టెంబర్ 30న ఈనాడు ఎడిటర్, పబ్లిషర్, ప్రింటర్, రెసిడెంట్ ఎడిటర్, సంబంధిత రిపోర్టర్‌కు న్యాయ నోటీసు పంపించారు.వాస్తవానికి ఏసీబీ దర్యాప్తు అధికారి ప్రత్యేక కోర్టులో కేటీఆర్ పాస్‌పోర్టుకు సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మెమో మాత్రమే దాఖలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఆ మెమోను కోర్టు ఉత్తర్వుగా పేర్కొనడం సరికాదని కేటీఆర్ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు.
కేటీఆర్ పాస్‌పోర్టును తాత్కాలికంగా జప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని న్యాయ నోటీసులో పేర్కొన్నారు. ఇదే సమయంలో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం సెప్టెంబర్ 28న పాస్‌పోర్టు చట్టంలోని సెక్షన్ 10(3)(e) కింద షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.కోర్టు ఇప్పటికే పాస్‌పోర్టు జప్తునకు ఆదేశాలు ఇచ్చినట్లు వార్త ప్రచురించడం ద్వారా కేటీఆర్‌పై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉందని న్యాయవాది పేర్కొన్నారు.వార్తకు ఆధారమైన సమాచారం, మూలాలు ఏమిటో వెల్లడించాలని, సంబంధిత కోర్టు రికార్డులు లేదా ఆదేశాలను రిపోర్టర్ పరిశీలించారా అనే అంశంపై వివరణ ఇవ్వాలని నోటీసులో కోరారు. అలాగే వార్తకు సంబంధించిన వాట్సాప్ సందేశాలు, ఈమెయిల్స్, నోట్స్, రికార్డింగ్స్, పత్రాలు, డ్రాఫ్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని సూచించారు.ప్రచురితమైన వార్తను తక్షణమే ఉపసంహరించుకుని, అదే ప్రాధాన్యతతో సవరణ ప్రచురించాలని, కేటీఆర్‌కు బేషరతు క్షమాపణ చెప్పాలని న్యాయ నోటీసులో డిమాండ్ చేశారు.అదేవిధంగా ఆన్లైన్, ఈ-పేపర్, వెబ్సైట్, సోషల్ మీడియా, డిజిటల్ ఆర్కైవ్స్లోనూ సంబంధిత వార్తను సరిచేయాలని కోరారు. 48 గంటల్లో తగిన చర్యలు తీసుకోకపోతే సివిల్, క్రిమినల్ పరువునష్టం చర్యలతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఆశ్రయిస్తామని నోటీసులో స్పష్టం చేశారు.
#KTR #KTRNews #KTRPassport #KTRLegalNotice #Eenadu #BRS #BRSNews #TelanganaPolitics #TelanganaNews #KTRACBCase #KTRCourtNews #KTRLatestNews #TelanganaPoliticalNews
