ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 13: ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లో చాలా మంది పేదరికంలో ఉన్నప్పటికీ.. ఆత్మగౌరవం కోసం తమను పేదలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఇష్టపడరని తెలిపారు.
ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, మాజీ ఎంపీ మధు యాష్కీతో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులు సమాజ గౌరవం కోసం జీవిస్తారు
ఆర్యవైశ్యులు కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ సమాజంలో గౌరవం కోసం జీవిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఎప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినేనని చెప్పారు.
గ్రామాల్లో పేదలకు అవసరమైన సమయంలో తినడానికి అప్పు ఇచ్చి ఆదుకునే వారిలో ఆర్యవైశ్య సోదరులు ముందుంటారని అన్నారు. గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తుకు వచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని తెలిపారు.
ప్రపంచంలో ఉన్నవి రెండే వృత్తులు.. అవి వ్యవసాయం, వ్యాపారం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
రోశయ్యను గుర్తు చేసుకున్న సీఎం
మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వైఎస్‌లు గల్లాపెట్టె నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్యులకే అప్పగించారని సీఎం గుర్తు చేసుకున్నారు.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రం ఆవిర్భవించిందని, అందుకు ఆనాటి ఆర్థిక మంత్రి రోశయ్య కారణమని సీఎం అన్నారు.
శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడుతున్న సమయంలో రోశయ్య తనను పిలిచి ఆవేశం తగ్గించుకుని అనుభవంతో ముందుకు వెళ్తే ఉన్నత స్థాయికి వస్తామని ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. తనను ముందుగా గుర్తించింది రోశయ్యేనని చెప్పారు.
రోశయ్య విమర్శించే వారు కాదని, తిట్టే వారు కాదని.. చురకలు వేసేవారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రం విడిపోయినప్పటికీ రోశయ్య గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రోశయ్య విగ్రహం ఏర్పాటుపై కొంతమంది విమర్శలు చేసిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.
హైదరాబాద్‌తో రోశయ్యకు ప్రత్యేక అనుబంధం
నాలుగు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చానని.. మంచైనా, చెడైనా ఇక తనది హైదరాబాద్‌నే అని రోశయ్య చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన మాటలను గౌరవించి హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.
మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములును ప్రస్తావించిన సీఎం
ఆర్యవైశ్యులను వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ ఆర్యవైశ్య బిడ్డ అని పేర్కొన్నారు.
ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా మహాత్మా గాంధీ గొప్పతనం తెలియని వారు ఉండరని అన్నారు. ప్రపంచస్థాయి నేతగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం గర్వకారణమని తెలిపారు.
అనేక మంది ఆర్యవైశ్య ప్రముఖులు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
పొట్టి శ్రీరాములు పోరాటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. దేశ సమగ్రత కోసం మహాత్మాగాంధీ ప్రాణాలు ఇస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు.
ఆర్యవైశ్యులకు రాజకీయ ప్రాధాన్యం పెరగాలి
ఆర్యవైశ్యులకు రావాల్సిన గుర్తింపు ఇంకా పూర్తిగా రాలేదని సీఎం అన్నారు. ఆర్యవైశ్యుల పట్ల తమ ప్రభుత్వానికి సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు.
పేద ఆర్యవైశ్య బిడ్డలకు ఆత్మగౌరవ భవనం సంపూర్ణంగా ఉపయోగపడాలని సీఎం ఆకాంక్షించారు. భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఆర్యవైశ్యులందరూ కలిసి ఉంటేనే బలం ఉంటుందని.. సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తే అందరూ గౌరవిస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చామని, కొడంగల్‌లోని ఒక మున్సిపాలిటీలో ఆర్యవైశ్య కులానికి చైర్మన్ పదవి ఇచ్చామని గుర్తు చేశారు.
రాజకీయాల్లో ఆర్యవైశ్యులు తమ వాటాను తాము తీసుకోవాలని సీఎం సూచించారు. అందరూ కలిసి కట్టుగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని అన్నారు.

