1000 రోజుల పాలనపై ప్రజలకు వివరించాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించడంతో పాటు శాసనసభలో నియోజకవర్గ సమస్యలను బలంగా ప్రస్తావించాలని అన్నారు.

ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ అధ్యక్షతన ఫామ్‌హౌస్‌లో సమావేశమై శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగకుండా కుట్ర చేశారని ఆరోపించారు. అధికారం కోల్పోయినా అహంకారం వీడకుండా పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులను దూషించారని, మూడు రోజుల పాటు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారని అన్నారు.

అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడంతో పాటు మహిళా అధికారుల సమక్షంలో టీషర్టులు విప్పి ఇబ్బందులకు గురిచేశారని సీఎం ఆరోపించారు. శాసనసభాపతిని అత్యంత అభ్యంతరకరంగా దూషించారని పేర్కొన్నారు. నిరసనలో భాగంగా ఎస్సీ సెల్ కార్యక్రమం చేపట్టిన సమయంలో దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం ద్వారా వారిని అవమానించారని విమర్శించారు.

ప్రతిపక్షం చేసిన కుట్రను బలంగా తిప్పికొట్టి ప్రభుత్వంపై జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులను సీఎం అభినందించారు. జరిగిన సంఘటనలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

సభకు ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరి

ఎమ్మెల్యేలు శాసనసభలో జరిగే చర్చల్లో తప్పనిసరిగా పాల్గొనాలని రేవంత్ రెడ్డి సూచించారు. సభ జరిగినన్ని రోజులు సభ్యుల హాజరు సంపూర్ణంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రజలు ఇచ్చిన పదవిని, హోదాను సక్రమంగా ఉపయోగించుకోకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా రాణించడం కష్టమవుతుందని హెచ్చరించారు.

నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావించి ప్రజల తరఫున గొంతు వినిపించాలని సూచించారు.

చారిత్రక భవనంలో శాసన మండలి

అందరికీ వెసులుబాటుగా ఉండేలా అత్యంత చారిత్రక భవనంలో శాసన మండలి సమావేశాలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. అసెంబ్లీలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించి దానికి దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టుకున్నామని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో ఎదిగిన నేతలపై వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగిన కొంతమంది నాయకులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలని చూస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోతే సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వంటి నాయకులు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా అని ప్రశ్నించారు.

పోలీసులపై దాడుల అంశంపై రేవంత్ ఫైర్

పోలీసు సిబ్బందిలో కేటీఆర్‌ను చూసినట్టుగా కొందరు వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే అధికారులపై అంతటి ఆక్రోశంతో దాడులకు పాల్పడ్డారని విమర్శించారు.

కులగణనపై కేంద్రంపై ఒత్తిడి

తెలంగాణలో చేపట్టిన కులగణనను దేశానికి రోల్ మోడల్‌గా సీఎం అభివర్ణించారు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత అని అన్నారు. తెలంగాణ నమూనాను అనుసరించి దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి

SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేగా మరోసారి గెలవాలనుకునే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.

దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారని, అయితే ఓటర్ల జాబితాలో 88 కోట్ల మంది మాత్రమే ఉన్నారని సీఎం పేర్కొన్నారు. దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ, ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

SIR అంశాన్ని ప్రతి ఎమ్మెల్యే సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని, ఓటర్ల హక్కుల పరిరక్షణకు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.

వ్యక్తిగత పనితీరుపైనే రాజకీయ భవిష్యత్

ప్రతి ఎమ్మెల్యే ప్రవర్తన, వ్యక్తిగత పనితీరు రెండోసారి గెలుపుపై ప్రభావం చూపుతుందని సీఎం అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై పనిచేయాలని సూచించారు.

వెయ్యి రోజుల పాలనకు సహకరించిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn