అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్.. దళితుల అవమానంపై కఠిన చర్యలు

దళితుల నడిచిన నేలను శుద్ధి చేస్తారా? మీ అహంకారాన్ని శుద్ధి చేసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు, దేశాభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర, దళితులు–ఆదివాసీలకు రిజర్వేషన్లు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం, అలాగే తెలంగాణ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అంటే దేశంలోని కోట్లాది ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించే వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితులను పరిశీలించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్లే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగిందని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్

ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానంలో భాగమని స్పష్టం చేశారు.

కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో జన్మించి, రజాకార్ల దాడుల్లో తండ్రిని కోల్పోయి, కార్మిక నాయకుడిగా ఎదిగి జాతీయ స్థాయికి చేరుకున్న నాయకుడు మల్లికార్జున ఖర్గే అని సీఎం గుర్తు చేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడిని అవమానించడం సరికాదన్నారు.

ఖర్గేకు అవమానంపై సీఎం ఆగ్రహం

ఉత్తరాఖండ్‌లోని ఒక మైదానంలో జరిగిన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్న అనంతరం అదే మైదానంలో ఆగస్టు 10న బీజేపీ అనుబంధ సంస్థ శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం హేయమైన చర్య అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఈ ఘటనను అసెంబ్లీ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. ఈ విషయంపై ఖర్గే రాజ్యసభలో భావోద్వేగంతో ప్రధానిని ప్రశ్నించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని తెలిపారు. పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతిని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని చెప్పారు.

అసెంబ్లీని అడ్డుకునేందుకు కుట్ర: రేవంత్

విద్యా రంగంలో అక్రమాలు, ధరణి వ్యవహారాలు, 22ఏ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం భావించిందని సీఎం తెలిపారు. అయితే ఫామ్‌హౌస్‌లో కుట్ర చేసి కొంతమంది సభ్యులను సభను అడ్డుకునేందుకు ఉసిగొల్పారని ఆరోపించారు.

ఈ అంశాలపై చర్చ జరిగితే గత పదేళ్ల పాలనలో జరిగిన పరిణామాలు, అప్పుల భారం, ప్రజలకు వాస్తవాలు తెలిసిపోతాయనే భయంతోనే సభలో చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.

సభాపతిని అవమానించడం దారుణం

సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను అవమానించేలా కొంతమంది సభ్యులు వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులపై దాడులు చేయడంతో పాటు సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారని మండిపడ్డారు.

వ్యక్తిని మాత్రమే కాకుండా తల్లిని కూడా అవమానించారని సీఎం పేర్కొన్నారు. భారతదేశాన్ని భారతమాతగా, తెలంగాణను తెలంగాణ తల్లిగా భావించే సమాజంలో మహిళలను అవమానించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు.

ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ సభాపతికి క్షమాపణ చెప్పి, తన పార్టీ సభ్యులతో కూడా క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అందరూ భావించారని, కానీ అలా జరగలేదని రేవంత్ రెడ్డి అన్నారు.

ఫామ్‌హౌస్ ముందు డప్పులతో నిరసన

అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా ప్రజాస్వామ్యవాదులు ఫామ్‌హౌస్ ముందు డప్పులు కొట్టారని సీఎం తెలిపారు. అయితే వారు ఎలాంటి హింసకు పాల్పడలేదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన తెలిపారని అన్నారు.

దళిత సోదరులు తమ భావాలను వ్యక్తం చేసేందుకు డప్పును ఒక సాధనంగా ఉపయోగిస్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఫామ్‌హౌస్ వద్ద నిరసన తెలిపిన వారిని లోపలికి పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉందన్నారు.

“దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తారా?”

దళితులు నడిచిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించడం తీవ్ర అవమానకరమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

“వాళ్లు దళితులు నడిచిన నేలను శుద్ధి చేస్తే.. వారి మనసుల్లో పేరుకుపోయిన అంటరానితనాన్ని ఎలా శుద్ధి చేయాలి? నీళ్లతో కడగాలా? యాసిడ్‌తో కడగాలా?” అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.

దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తేనే సమాజం కడుపు నిండుతోందని అన్నారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదని, అహంకారం, అంటరానితనం, వివక్షతో కూడిన ఆలోచనలను శుద్ధి చేసుకోవాలని సూచించారు.

“దొర అహంకారాన్ని తెలంగాణ సమాజమే శుద్ధి చేస్తుంది”

కేసీఆర్ మనసులో పేరుకుపోయిన దొర అహంకారాన్ని తెలంగాణ సమాజమే ప్రశ్నిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. సమాజంలో అశాంతిని పెంచి, ప్రజల మధ్య వైరాన్ని సృష్టించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు.

పదేళ్లు అధికారంలో ఉన్న వారు ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని సీఎం ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు

సభాపతిని అవమానించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. కుట్ర పన్నిన వారితో పాటు కుట్రలో భాగస్వాములైన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 6న జరిగిన ఘటన నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న అన్ని పరిణామాలను క్రోడీకరించి, సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు.

“మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తే లేదు”

సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌కు సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చెప్పారు.

“సభాపతిగా మీరు మానసిక ధైర్యం కోల్పోవద్దు. మీ మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేశారు.

చట్టాల్లోని సెక్షన్లను ఉపయోగించుకుని కొంతమంది బెయిల్ పొందవచ్చని, కానీ తెలంగాణ సమాజం మాత్రం వారికి బెయిల్ ఇవ్వదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రజాకార్లను తరిమికొట్టి మట్టికరిపించిన చరిత్ర తెలంగాణ గడ్డకు ఉందని గుర్తు చేసిన సీఎం, ప్రభుత్వం సభాపతికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn