ఒక్కో ఇంటికి రూ.11 ల‌క్ష‌లు…రూ.5ల‌క్ష‌లు ప్ర‌భుత్వ స‌బ్సిడీ

 

*క్యూర్ ప‌రిధిలో కొత్త ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తిస్తాం*
*తొలివిడ‌త‌లో 16 నియోజ‌క‌వ‌ర్గాల్లో 8వేల ఇళ్లు*
*జూలై 21 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌*
*త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల్లో స్ధ‌లాల గుర్తింపు*
*ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఇళ్ల మంజూరులో రిజ‌ర్వేష‌న్‌*
*ఒక్కో ఇంటికి రూ.11 ల‌క్ష‌లు*
*రూ.5ల‌క్ష‌లు ప్ర‌భుత్వ స‌బ్సిడీ*
*రూ.40-60 ల‌క్ష‌ల విలువ‌చేసే స్ద‌లం ల‌బ్దిదారునిపేరిట ఉచిత రిజిస్ట్రేష‌న్*
*ల‌బ్దిదారుని వాటా రూ.6 ల‌క్ష‌లు*
*నాలుగు విడ‌త‌ల్లో చెల్లింపు సౌక‌ర్యం
*త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు శుభవార్త‌*
*రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి*

*హైద‌రాబాద్* :- హైద‌రాబాద్ ప్రాంతంలోని క్యూర్ ప‌రిధిలో తొలి విడ‌త‌గా 16 నియోజ‌వ‌ర్గాల్లో ప్రయోగాత్మ‌కంగా నియోజ‌క‌వ‌ర్గానికి 500 ఇళ్ల చొప్పున‌ ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామ‌ని, త్వ‌ర‌లో మ‌రో 8 నియోజ‌క‌వ‌ర్గాల‌లో కూడా ఈ ప‌ధ‌కం అమ‌లు చేస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ప్ర‌క‌టించారు. పేద‌వాడి సొంతింటి క‌ల నెర‌వేరేవ‌ర‌కు ఇందిర‌మ్మ ఇళ్ల య‌జ్ఞం కొన‌సాగుతుంద‌ని, చివ‌రి ల‌బ్దిదారునికి ఇల్లు అందేవ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని , ఇది నిరంత‌ర ప్ర‌క్రియ అని పేర్కొన్నారు.

సోమ‌వారం నాడు స‌చివాల‌యంలో స‌హ‌చ‌ర మంత్రులు దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌ త‌దిత‌రుల‌తో క‌లిసి క్యూర్ ప‌రిధిలోని ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఇందిర‌మ్మ ఇళ్ల బ్రోచ‌ర్‌ , మీసేవ‌, వాట్సాప్ ద‌ర‌ఖాస్తు ల‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స‌హేతుకంగా వివ‌రించిన న‌ల్గొండ జిల్లా న‌కిరేక‌ల్ గ్రామానికి చెంద‌ని కొండా నాగ‌రాజుకు ల‌క్ష రూపాయిల న‌గ‌దు బ‌హుమ‌తిని అంద‌జేసి మంత్రులు స‌త్క‌రించారు.

ఈసంద‌ర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 4.50 లక్ష‌ల ఇళ్ల మంజూరు చేయ‌గా రెండ‌వ విడ‌త‌లో 2.50 ల‌క్ష‌ల ఇళ్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నామ‌ని ఇప్ప‌డు క్యూర్ ప‌రిధిలో ల‌క్ష ఇళ్లు ప్రారంభిస్తూ 8ల‌క్ష‌ల ఇళ్లు పేద‌ల‌కు అందిస్తున్నామ‌ని అన్నారు. వ‌చ్చే నెలలోగా రెండు ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్లు పూర్తికానున్నాయ‌ని అన్నారు.

గ‌త పాల‌కులు ప‌నికిరాని ఆలోచ‌న కార‌ణంగా ఎన్నిక‌ల స‌మయంలో హైద‌రాబాద్‌కు 30-35 కిలోమీట‌ర్ల దూరంగా ఇళ్ళ‌ను నిర్మించ‌డం వ‌ల‌న కేవ‌లం 8-9 వేల మంది మాత్ర‌మే నివాసాల్లో దిగార‌ని , మిగిలిన వారు మంజూరు ప‌త్రాలు తీసుకున్నారే త‌ప్ప దిగ‌లేద‌న్న విష‌యం త‌మ ప‌రిశీల‌న‌లో వెల్ల‌డైంద‌న్నారు.

ఈ ప‌రిస్ధితుల్లో పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా నియోజ‌క‌వ‌ర్గాన్ని యూనిట్‌గా తీసుకొని పేద‌లు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణాలు చేప‌డుతున్నాం.

పేద‌ల నివాస ప్రాంతాల్లోనే 525 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో సుమారు 40-60 ల‌క్ష‌ల రూపాయిల విలువ క‌లిగిన స్ధలాల‌ను ఆడ‌ప‌డుచుల పేరిట రిజిస్ట్రేష‌న్ చేసి ఇస్తామ‌ని తెలిపారు. దీనిని ప‌దేళ్ల వ‌ర‌కు అమ్ముకునే అవ‌కాశం ఉండ‌ద‌ని, అయితే బ్యాంకులో రుణం కోసం త‌న‌ఖా పెట్టుకోవ‌చ్చున‌ని తెలిపారు. ఇళ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ ఉంటుంద‌న్నారు

ఒక‌వేళ ఇల్లు మంజూరు కాక‌పోతే క‌ట్టిన రూ.10 వేల రూపాయిలు తిరిగి చెల్లిస్తామ‌న్నారు. ప్ర‌భుత్వం ఒక్కో ఇంటికి రూ.5 ల‌క్ష‌ల రూపాయిల‌ను ఉచితంగా ఇస్తుంద‌ని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 11 ల‌క్ష‌ల రూపాయిల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతున్నందున ల‌బ్దిదారుల నుంచి మిగిలిన ఆరు ల‌క్ష‌ల రూపాయిల‌ను నాలుగు వాయిదాల్లో తిరిగి తీసుకుంటామ‌ని , ఆ మొత్తంలో ఈ 10 వేల రూపాయిల‌ను మిన‌హాయిస్తామ‌ని మంత్రి గారు తెలిపారు.

ఏనియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఆ నియోజ‌క‌వ‌ర్గంలోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌న్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా స్ధానిక ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చించి స్ధ‌లాల‌ను ఎంపిక చేయ‌డం జ‌రిగింది. ఈనెల 21వ తేదీ నుంచి మీసేవ‌, వాట్సాప్ ( నెంబ‌ర్ 8096958096), వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చున‌ని తెలిపారు.

ల‌బ్దిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6ల‌క్ష‌ల వ‌ర‌కు ఉండాల‌ని, ద‌రఖాస్తు దారుని పేరిట క్యూర్ ప‌రిధిలో స్ధ‌లం గానీ, స్వంత ఇల్లుకానీ ఉండ‌కూడ‌ద‌న్నారు. ఒక కుటుంబం నుంచి ఒక ద‌ర‌ఖాస్తు మాత్ర‌మే స్వీక‌రిస్తార‌ని. అర్హ‌త బ‌ట్టి కేటాయింపు జ‌రుగుతుంద‌న్నారు. 360 డిగ్రీల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల ల‌బ్దిదారుల వ‌డ‌పోత జ‌రుగుతుంద‌ని, అప్ప‌టికీ ఎక్కువ ద‌ర‌ఖాస్తులు వ‌స్తే అంద‌రి ముందూ బ‌హిరంగంగా లాట‌రీ తీసి ఇళ్లు మంజూరు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప‌ధ‌కం కింద ప్ర‌తిపాదించిన 525 చ‌ద‌రపు అడుగుల‌ ఫ్లాట్ లో ఒక బెడ్ రూమ్‌, హాల్‌, కిచెన్ ఉంటాయన్నారు.

హైద‌రాబాద్ లోప్ర‌స్తుతం జ‌రుగుతున్న బోనాల జాతర శుభ సంద‌ర్బంలో క్యూర్ ప‌రిధిలో పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌ని వచ్చే ఏడాది క్యూర్ ప‌రిధిలో కొత్త ఇందిర‌మ్మ ఇళ్ల నుంచే వ‌చ్చే ఏడాది బోనాలు ఎత్తించే విధంగా నిర్మాణాలు శ‌ర‌వేగంగ‌గా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా పేద‌వాని సంక్షేమం విష‌యంలో ఏమాత్రం రాజీ ప‌డ‌డం లేదు. ఇందిర‌మ్మ ఇళ్ల పురోగ‌తిని బ‌ట్టి ప్ర‌తిసోమ‌వారం చెల్లింపులు జ‌రుపుతున్నాం. ఈ ప్ర‌భుత్వం పేద‌వాని గురించే కాకుండా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకం గురించి కూడా ఆలోచ‌న చేస్తోంది. ఇళ్ల విష‌యంలో త్వ‌ర‌లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజానీకానికి కూడా శుభావార్త అందిస్తామ‌న్నారు.

క్యూర్ ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ఒక చారిత్రాత్మ‌క కార్య‌క్ర‌మ‌ని ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధర్‌బాబు అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిర‌మ్మ ఇళ్ల ప‌ధ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్ర‌తి హామీనీ నిల‌బెట్టుకుంటున్నామ‌ని ఉచిత బ‌స్సు, ఉచిత క‌రెంట్, అర్హులంద‌రికీ రేష‌న్ కార్డులు ఇందిర‌మ్మ ఇళ్లు ఇలా అనేక కార్య‌క్రమాల‌ను అమ‌లు చేస్తున్నామ‌న్నారు. మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ హైద‌రాబాద్ ప‌రిధిలో పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డం శుభప‌రిణామం అన్నారు.
ఇళ్ల నిర్మాణాలు చేప‌ట్టే నియోజ‌క‌వ‌ర్గాలు:
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి;
మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్‌పల్లి;
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రాయదుర్గం;
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని తట్టిఅన్నారం, బండ్లగూడ;
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని కౌకూర్;
నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని రెడ్‌హిల్స్ మ‌రియు నీలోఫర్ ఆసుపత్రి సమీప పోలీస్ క్వార్టర్స్;
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హకీంపేట్ ద‌ర్గ మరియు జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కుల్సుంపురా సమీప పోలీస్క్వార్టర్స్;
బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని నందిముసలిగూడ;
అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సిటీపోలీస్ లైన్స్
కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీకాలనీ;
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోచారం ఎల్‌ఐజీకాలనీ;
కుత్బుల్లాపూర్ అసెం బ్లీ నియోజకవర్గంలోని గాజులరామారం;
సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పాటిగడ్డ;
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మారేడ్‌పల్లి–మహేంద్రహిల్స్;
మలక్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం ఆర్అం డ్ బీ క్వార్టర్స్. ఉన్నాయి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn