కడుపులో కుళ్ళు, మాటల్లో విషం..మూసీని అడ్డుకోవడానికి ప్రయత్నాలు

మూసీ పునర్జీవన ప్రాజెక్టు వల్ల నష్టపోయే పేదలకు తమ ప్రభుత్వం అన్యాయం చేయదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశ పూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మూసీ పునర్జీవణ ప్రాజెక్టు పైన వివిధ వర్గాలకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోపాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, మేధావులు, మీడియా హెడ్స్ పాల్గొన్నారు.అధికారాన్ని కాపలాదారుగా వినియోగిస్తాం తప్ప, ప్రజలపై ఆధిపత్యం చెలాయించడానికి తమ ప్రభుత్వం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అందుకే ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతతో ఈ కార్యక్రమం ద్వారా వాస్తవాలను ప్రజలకు చెప్పాలని భావించామన్నారు.
గొప్ప వారసత్వ సంపద కలిగిన ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్లు ఎందుకు మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకోవడం సమస్యకు పరిష్కారం కాదు.. ఎందుకు అడ్డుకుంటున్నారో కారణం చెప్పండి.. ఏదైనా తప్పులు ఉంటే సూచనలు చేయండి అని సీఎం పిలుపునిచ్చారు.మూసా, ఈసా నదుల సంగమం వద్ద మహాత్మా గాంధీ ఆనాడు అస్థికలు కలిపారని,అంతటి చరిత్ర ఉన్న బాపూ ఘాట్ ను ఎంతమంది పర్యాటకులు సందర్శిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
కాలుష్యంతో మూసీ నది విషతుల్యంగా మారిందన్న ఆయన మానవ తప్పిదాలతో నల్లగొండ జిల్లా ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లాలో పుట్టిన మూసీ నది హైదరాబాద్ కు వచ్చే సరికి కాలుష్యమయంగా మారుతోందన్నారు. మూసీకి, హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందన్న ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఆ చరిత్రను కాలగర్భంలో కలిపేద్దామా అని ప్రశ్నించారు.ఎవరికో నష్టం కలిగించాలన్నది మా ప్రభుత్వ ఉద్దేశం కాదన్నార
బ్యూటిఫికేషన్.. లూటిఫికేషన్ అని కొందరు మాట్లాడుతున్నారన్న ఆయన 5 వేల కోట్లతో గాంధీ విగ్రహం అంటూ సొంత తెలివి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంత పెద్ద యుద్ధాన్నైనా శాంతితో గెలవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారు,
అలాంటి మహాత్ముడి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనపై లేదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
దేవతలు యజ్ఞాలు చేసినపుడు రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ పరివాహక నిరాశ్రయుల పూర్తి వివరాలు ఉన్నాయన్న ఆయన ఎంత పరిహారం ఇవ్వాలో చెప్పాలని ప్రతిపక్షాలకు సూచించారు.
నిర్వాసితులకు ఇళ్లు నిర్మించడంతో పాటు ఉపాధి కల్పిస్తామని, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
పేదలతో శత్రుత్వం పెంచుకుంటే ఎవరైనా మళ్లీ అధికారంలోకి వస్తారా అని ఆయన ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవం జరిగితే కాంగ్రెస్ కు, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని, ఇక వాళ్లకు అధికారం కలగానే మిగులుతుందని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.కడుపులో కుళ్ళు, మాటల్లో విషం,చూపుల్లో పగ తో అడ్డుకోవాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నేను మీలో ఒకడిని.. మీ సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం,
అందరి సహకారంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
