అల్లు అర్జున్ అరెస్ట్ పైన సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
1 min read అల్లు అర్జున్ అరెస్ట్ పైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం పనిచేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. అరెస్టు లో తన ప్రమేయం ఏమీ లేదన్నారు. రాష్ట్ర హోం మంత్రి గా తనకు అరెస్ట్ సమాచారం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. భారతదేశంలో సల్మాన్ ఖాన్ , సంజయ్ దత్ లాంటి వారు కూడా అరెస్టయ్యారని ఆయన స్పష్టం చేశారు. అల్లు అర్జున్ అరెస్టు చేశామని అడుగుతున్నారు తప్ప మహిళ చనిపోయింది, ఆమె కొడుకు ఇంకా జీవన్మరణ సమస్యతో బాధపడుతున్న విషయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట పైన క్రిమినల్ కేసు బుక్ అయిందని, ఇప్పటికే థియేటర్ యజమానిని అరెస్ట చేశామన్నారు. సంఘటన జరిగిన పది రోజుల తర్వాత అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అల్లు అర్జున్ కారులో వచ్చి సినిమా చూసి వెళ్తే ఎటువంటి సమస్య ఉండకపోయేది ,కానీ కారులోంచి బయటికి వచ్చి చేతులూపి హడావిడి చేయడంతో జనం పెద్ద ఎత్తున ఎగపడ్డారన్నారు. అక్కడ పోయిన మహిళ ప్రాణాలకు బాధ్యులెవ్వరని సీఎం ప్రశ్నించారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్ తెలుసన్నారు. అల్లు అర్జున్ మామ చిరంజీవి కాంగ్రెస్ నాయకుడని సీఎం వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కుటుంబంతో తనకు బంధుత్వం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. చనిపోయిన మహిళ కొడుకు ఇంకా కోమాలో ఉన్నాడని, అతను కోలుకునే సమయానికి తల్లి కనిపించదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హీరో లు ఏమైనా ప్రత్యేకమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ తో పోరాడి దేశాన్ని గెలిపించిన సైనికుడా అని ముఖ్యమంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.