కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ..?
1 min readఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలాఉంది. ఆ పార్టీకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గుడ్ బై చెప్పే అవకాశాలు స్పష్టంగా కనిస్తున్నాయి. త్వరలోనే తన కుమారుడు రాజేష్ రెడ్డితో కలిసి కూచుకుళ్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డితో విభేదాల కారణంగానే కూచుకుళ్ల తన దారి తాను చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. నాగర్ కర్నూల్ లో తన వర్గాన్ని ఎమ్మెల్యే అణిచివేస్తుండటంతో దామోదర్ రెడ్డి ఆవేదన చెందుతున్నాడట. పార్టీ నాయకత్వం ద్రుష్టికి సమస్యను తీసుకెళ్లినప్పటికి మర్రి జనార్దన్ రెడ్డి వైపే మొగ్గుచూపిస్తుండటంతో ఆయన తన దారి తాను చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు . ఆత్మగౌరవ సమస్య వల్లనే కాంగ్రెస్ చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తన కొడుకు రాజేష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపైన కూడా దామోదర్ రెడ్డి ఆందోళనగా ఉన్నారట. బీఆర్ఎస్ లో రాజేష్ రెడ్డి ఎదిగే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావుతో కలిసి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జూపల్లితో దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ రెడ్డి చర్చలు జరిపారు.
కాంగ్రెస్ తరుపున అనేక యేళ్ల పాటు నాగర్ కర్నూలులో దామోదర్ రెడ్డి రాజకీయాలు చేశారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డిపైన పలు సార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్సీగా విజయం సాధించారు. అయితే నాగం జనార్దన్ రెడ్డి ని కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో తీవ్ర అసంత్రుప్తికి గురైన దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించినప్పటికి పార్టీ అధిష్టానం మర్రి జనార్దన్ రెడ్డి వైపు మొగ్గు చూపించింది. ఆ తర్వాత కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరితే నాగర్ కర్నూల్ రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి కాకుండా దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే ఇక్కడ బీఆర్ఎస్ కు కష్టకాలమేనని చెప్పాలి. నాగం జనార్దన్ రెడ్డి బలమైన నాయకుడు అయినప్పటికి వరసగా ఓటమి పాలు కావడంతో పాటు వయసు రీత్యా ఆయన క్రేజ్ తగ్గతూ వస్తోంది.నాగం కూడా ఆరోగ్యరీత్యా అప్పుడప్పుడే నియోజకవర్గానికి వెళ్లి వస్తున్నారు. ఆయన కుమారుడు కూడా పెద్ద యాక్టివ్ గా లేడు. దీంతో నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి ఓడించడం నాగం వల్ల అయ్యేపని కాదని కాంగ్రెస్ వర్గాలే భావిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయం కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. నాగం జనార్దన్ రెడ్డికి నచ్చచెప్పి రాజేష్ రెడ్డికి టికెట్ ఇచ్చే సూచనలున్నాయి.