రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధం
1 min readతెలంగాణలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు రంగం సిద్ధమౌతోంది.త్వరలోనే ఆయన తెలంగాణ వ్యాప్తంగా భారీ పాదయాత్రకు ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. డైబ్బై శాతం నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర రూట్ మ్యాప్ తయారౌతోంది. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర నిర్వహించనున్నట్లు సమాచారం. పాదయాత్ర ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఏ క్షణమైనా సాధారణ ఎన్నికలకు వచ్చే అవకాశం ఉండటంతో రేవంత్ రెడ్డి యాత్రకు తొందరపడుతున్నట్లు చెపుతున్నారు. పార్టీ అధిష్టానం అనుమతితో డిసెంబర్ లో ఆయన పాదయాత్ర మూహుర్తాన్ని ప్రకటించనున్నారు. పార్టీ సీనియర్లు ఈ యాత్రకు సహకరిస్తారా లేదా అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి పట్టించుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ఎవరు వచ్చినా రాకపోయినా పాదయాత్ర పూర్తి చేసి తీరాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారని సన్నిహితులు చెపుతున్నారు.
మరో వైపు రేవంత్ రెడ్డి పాదయాత్ర జరగకుండా చూసేందుకు కొందదు సీనియర్లు ఎత్తుగడలు వేస్తున్నారు. ఎక్కడిక్కడ జిల్లాల వారీగా స్థానిక ముఖ్యనాయకుల ఆధ్వర్యంలో పాదయాత్రలు చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల అన్ని ప్రాంతాలను త్వరగా కవర్ చేసే అవకాశం ఉంటుందన్న వాదనను వినిస్తున్నారు. అయితే ఈ పాదయాత్రల వల్ల ఏ మాత్రం ప్రభావం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. జనాకర్షణ కల్గిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తేనే పార్టీకి ఉపయోగం ఉంటుందని కార్యకర్తలు నమ్ముతున్నారు.
అయితే తెలంగాణలో రెండు వారాల పాటు భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీకి ఇక్కడి రాజకీయ పరిస్థితులు అర్థమయ్యాయని తెలుస్తోంది. ఇక్కడి నాయకుల్లో ఎవరికి జనాకర్షణ ఉందని, కార్యకర్తలు ఎవరిని కోరుకుంటున్నారన్న విషయంలో రాహుల్ కు క్లారిటీ వచ్చిందని సమాచారం. భారత్ జోడో యాత్రను సమర్థవంతంగా నిర్వహించడం కూడా రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ గా మారింది. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాకపోవచ్చునని సమాచారం. కొత్తగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే కు కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపైన మంచి గురి ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఎవరెన్ని అభ్యంతరాలు తెలిపినా రేవంత్ రెడ్డి పాదయాత్ర మరో నెలలో ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
వి.ఎస్.ఆర్