గాంధీ పరివార్‌కు దేశం అండగా ఉండాలి’: సీఎం రేవంత్ రెడ్డి

కేరళలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో రెండు పరివార్‌ల మధ్య పోరాటం జరుగుతోందని, ఒకటి సంఘ్ పరివార్ కాగా.. రెండోది గాంధీ పరివార్ అని అన్నారు.
సంఘ్ పరివార్ దేశాన్ని మతం, భాష, సంస్కృతి, కులం వంటి అంశాల ఆధారంగా విడగొడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు గాంధీ పరివార్ దేశం కోసం అన్నీ ఇచ్చిందని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
సంఘ్ పరివార్‌ను ఓడించడానికి దేశ ప్రజలంతా గాంధీ పరివార్‌కు అండగా నిలవాలని ఆయన కోరారు. సంఘ్ పరివార్ దేశానికి, ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదకారి అని వ్యాఖ్యానించారు.
దేశాన్ని సంఘ్ పరివార్ నుంచి రక్షించేందుకు గాంధీ పరివార్ కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. సంఘ్ పరివార్‌ను ఓడించి ఈ పోరాటంలో తాము ముందున్నామని కేరళ ఇప్పటికే సంకేతాలు ఇచ్చిందని పేర్కొన్నారు.
