నీతిమాలిన కథనాలు రాస్తారా..? షర్మిల
1 min readతెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలను వైఎస్ జగన్ సోదరి షర్మిల ఖండించారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చి కథనం పూర్తి అవాస్తవమని ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో బ్యానర్ ఐటమ్ గా వచ్చిన కథనం ఆలస్యంగా తన ద్రుష్టికి వచ్చిందని షర్మిల అందులో పేర్కొన్నారు. వై.ఎస్.ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.ఏ పత్రిక అయినా, ఏ ఛానల్ అయినా ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు అని షర్మిల లేఖలో పేర్కొన్నారు.అది నీతి మాలిన చర్య అని స్పష్టం చేసిన షర్మిల ఆ పత్రిక, ఛానల్ పైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోనని తేల్చి చెప్పారు.
ఎపి సి.ఎం వై.ఎస్ జగన్ పాలనపైన షర్మిల తీవ్ర అసంత్రుప్తితో ఉన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇటీవల కథనాన్ని ప్రచురించింది. రాజశేఖర్ రెడ్డి తరహాలో పాలన జరగడం లేదని, అందుకే తెలంగాణలో వైసీపీ పార్టీని ఏర్పాటు చేయడానికి ఆమె సిద్దపడుతున్నట్లు అందులో పేర్కొన్నారు. తెలంగాణ వైసీపీ పేరుతో ఫిబ్రవరిలో పార్టీ ప్రకటిస్తారని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది. దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో షర్మిల ఈ ప్రచారంపైన స్పందించాల్సి వచ్చింది.