షర్మిలకు షాక్ ఇచ్చిన కేసీఆర్
1 min readవై.ఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమౌతున్న ఆమెపైన ప్రభుత్వం ద్రుష్టి సారించింది. టీఆర్ఎస్ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న షర్మిలను ఓ కంట కనిపెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చింది.ఇందులో భాగంగా ఆమెకు ఇటీవల ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో కార్యకలపాలు ప్రారంభించిన సమయంలో షర్మిలకు కేసీఆర్ సర్కార్ భద్రత కల్పించింది. ఖమ్మం సభకు ముందుకు 2+2 గన్ మెన్లను ఆమె సెక్యూరిటీ కోసం కేటాయించారు. అయితే ఖమ్మం సభలో షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఛాలెంజ్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వాలంటు ఇటీవల మూడు రోజుల దీక్ష చేశారు. ఈ సమయంలో ప్రభుత్వంపైన తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. దీక్షను భగ్నం చేసే సమయంలో పోలీసులు వ్యవహారించిన తీరుపైన కూడా ఆమె ధ్వజమెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిలపైన టీఆర్ఎస్ వర్గాలు ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది.ఆమెకు ఎక్కువ సీన్ ఇవ్వొద్దని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సమచారం. ఇందులో భాగంగా షర్మిలకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. ఇంటలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం భద్రతను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. తెలంగాణలో షర్మిల భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్న అంచనాతోనే సెక్యూరిటీని తొలగించినట్లు చెపుతున్నారు. అయితే షర్మిల పార్టీ వర్గాలు మాత్రం కేసీఆర్ సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గన్ మెన్లను ఉప సంహరించున్నారనే విమర్శలు చేస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి చెల్లలుగా ఆమెకు ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశముందని సన్నిహితులు చెపుతున్నారు. మరో వైపు షర్మిలకు ప్రభుత్వాల నుంచి భద్రత కల్పించకపోయినప్పటికి ప్రైవేట్ గా పెద్ద సంఖ్యలోనే సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. నిరంతరం ఆమె చుట్టు కనీసం అరడజను మంది సిబ్బంది రక్షణగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలు ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేటు సెక్యూరిటీని వినియోగిస్తున్నారు.
మరో వైపు షర్మిల ప్రస్తుతం ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఖమ్మం సభలో పాల్గొన్న వారిలో కొందరు నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇందులో ఒక ముఖ్యనాయకుడు ఇటీవలె చనిపోయాడు. దీంతో షర్మిల కూడా ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.