దుబ్బకలో కాంగ్రెస్ మూడు ముక్కలాట
1 min readఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పోటీకి ఆశావాహులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అన్ని పార్టీల్లో పోటీదారుల సంఖ్య బాగా పెరుగుతోంది. ప్రధానంగా కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో టిక్కెట్ కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. నియోజకవర్గాల్లో పట్టు కోసం నేతల మధ్య పోటీ పెరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులు వచ్చే ఎన్నికల్లో తమ అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమౌతున్నారు.దీంతో అనేక నియోజకవర్గాల్లో ఇద్దరు ,ముగ్గురు నాయకులు టిక్కెట్ రేస్ లోకి వచ్చారు. పోటీ చేయాలని భావిస్తున్న నాయకులంతా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇటీవల తెలంగాణలో బాగా చర్చనీయాంశంగా మారిన నియోజకవర్గం దుబ్బాక. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో దుబ్బాకకు ఉప ఎన్నిక వచ్చింది. అయితే అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయి బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు విజయం సాధించడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి దుబ్బాక ఏదో విధంగా చర్చల్లో ఉంటూనే ఉంది. అయితే ఈ సీటును దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్, బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే కాంగ్రెస్ టిక్కెట్ కోసం ఇక్కడ పెద్ద ఎత్తున పోటీ నెలకొన్నది. గత ఉపఎన్నికల్లో పార్టీ తరుపున పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సారి కూడా తనకే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. దుబ్బాకలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకుగా శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ మంచి పట్టుంది. అన్ని మండలాల్లో ఆయనకు అనుచరులున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య నేతల ఆశీస్సులు కూడా శ్రీనివాస్ రెడ్డికి ఉన్నాయి. అయితే ఇటీవల పీసీసీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దామోదర రాజనర్సింహాతో చేతులు కలపడం ఆయనకు మైనస్ పాయింట్ గా మారింది. టిక్కెట్ విషయంలో రేవంత్ రెడ్డి సహకరించకపోతే చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కష్టకాలమనే చెప్పాలి.
మరో వైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ రెడ్డి కూడా టిక్కెట్ రేసులో ఉన్నారు. నియోజకవర్గంలో తన వర్గంతో పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నారు. గతంలో మెదక్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన దుబ్బాకలో కీలక నేతగా ఉన్నారు. అయితే శ్రావణ్ కుమార్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇదే సమయంలో కత్తికార్తీక కూడా దుబ్బాక కాంగ్రెస్ టిక్కెట్ తనదేనని స్పష్టం చేస్తున్నారు. ఆమె తన వర్గంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో పార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక కనీస ఓట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఆమె మధు యాష్కీ గౌడ్ సాయంతో దుబ్బాక టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కత్తికార్తీక కూడా మిగిలిన నాయకులతో కలవకుండా సొంతంగా పనిచేస్తున్నారు. మొత్తానికి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ముక్కలుగా మారిపోవడంతో కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఈ తతంగం ఎన్నికల వరకు కొనసాగే సూచనలున్నాయి. టిక్కెట్ ఎవరికి వస్తుందన్న దానిపైన ఆధారపడే మిగిలిన వారి రాజకీయ భవిష్యత్తు ఉండనున్నది.