తెలంగాణ లో కులగణన లెక్కలు ఇవే…

1 min read

50 రోజులలో
కులగణన పూర్తి చేయడం చరిత్రాత్మకం
#ఎన్నికల సమయంలో ఏ.ఐ.సి.సి అధినేత రాహుల్ గాంధీ వాగ్దానం అమలులోకి
#బి.సి,ఎస్.సి,ఎస్.టి చివరి అంచున ఉన్న తెగలకు ఇది మార్గదర్శనం
#ఫిబ్రవరి 4 న క్యాబినెట్ ముందుకు
#అదే రోజు అసెంబ్లీలో చర్చకు ప్రవేశం
#స్వాతంత్ర్యం తరువాత నిర్వహించిన సర్వేలలో అతి పెద్దదైన సర్వే
#3,54,77,554 మందిని సర్వే నిర్వహించాం

సామాజిక-ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయలతో పాటు 50 రోజుల వ్యవధిలో సమగ్రమైన కుల గణన నిర్వహించిన తెలంగాణా రాష్ట్రం అద్భుతమైన రికార్డును నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రజల కిచ్చిన హామీని తూ. చ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు రావడం చరిత్రాత్మక సందర్భంగా ఆయన అభివర్ణించారు

ప్లానింగ్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే వివరాలను పుస్తకం రూపంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్లానింగ్ సందీప్ సుల్తానీయ,రాష్ట్ర నోడల్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఆదివారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు రాష్ట్ర మంత్రులు దలసరి అనసూయ@సితక్క,దామోదర రాజ నరసింహం,పొన్నం ప్రభాకర్ లకు అంద జేసింది

ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రులు దామోదర్ రాజ నరసింహం,సితక్క,పొన్నం ప్రభాకర్ లతో కలిసి మాట్లాడారు

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇది తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి వేస్తున్న పెద్ద పీట అని ఈ సర్వేను ఫిబ్రవరి 4 న రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుని అదే రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు

ఇది 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ప్రధాన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా కీలకమైన అడుగని, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సమకాలీన సామాజిక-ఆర్థిక డేటా ఆధారంగా సంక్షేమ విధానాల కోసం పునాది వేసినట్లయిందన్నారు

ఈ సమగ్ర సర్వే, స్వాతంత్ర్యం తర్వాత అతిపెద్దది, 94,863 గణకులు, 9,628 సూపర్వైజర్లు, 94,261 గణన బ్లాక్స్‌తో 96.9% తెలంగాణ కుటుంబాలను కేవలం 50 రోజుల్లో కవర్ చేసిందన్నారు.
76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో సమాచారాన్ని డిజిటలైజ్ చేశారన్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫల్యంగా అమలు కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని ఆయన చెప్పారు. నవంబర్ 9, 2024న, తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ తొలి స్పందనకర్తగా పాల్గొని అధికారికంగా సర్వే ప్రారంభించిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

3,54,77,554 వ్యక్తులను కవర్ చేసిన ఈ సర్వే ముఖ్యమైన జనాభా డేటాతో వెల్లడయిందని బీసీలు 1,64,09,179 (46.25%), ఎస్సీలు 61,84,319 (17.43%), ఎస్టీలు 37,05,929 (10.45%), మొత్తం ముస్లిం జనాభా 44,57,012 (12.56%), ఇందులో 35,76,588 (10.08%) బీసీ ముస్లింలు, 8,80,424 (2.48%) ఓసీ ముస్లింలతో పాటు ఇతర ఓసీలు 44,21,115 (13.31%), మొత్తం ఓసీ జనాభా 15.79% ఈ సర్వేలో వివరాలు వచ్చాయన్నారు.

ఈ డేటాను తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా పునర్‌నిర్మాణం చేయడానికి ఉపయోగిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సర్వేకు ఎదురైన సవాళ్లలో తప్పుడు ప్రచారాలు, హైకోర్టులో పిల్‌లు దాఖలు కావడం వంటి అంశాలుఎదురు అయ్యాయని ఆయన తెలిపారు.

కానీ, న్యాయస్థానం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో సర్వే సమగ్రంగా కొనసాగిందన్నారు. 1.03 లక్షల ఇళ్లు తలుపులు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇళ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యాయన్నారు.

అయినా ప్రభుత్వం ప్రజల్లో అవగాహనపెంపొందించేలా చేసి సర్వే నిర్వహించడం జరిగిందన్నారు.

బిహార్ కుల గణనకు ఆరు నెలల వ్యవది పట్టడంతో పాటు రూ. 500 కోట్లు ఖర్చు కాగా, తెలంగాణ కేవలం 50 రోజుల్లో తక్కువ ఖర్చుతో పూర్తి చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సమర్థవంతమైన ప్రణాళిక, వికేంద్రీకృత అమలు, మరియు కఠినమైన మానిటరింగ్ కారణమని తెలిపారు. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి రోజువారీ పురోగతిని పర్యవేక్షించారని ఆయన చెప్పారు

“తెలంగాణ డేటా ఆధారిత పరిపాలనలో ముందంజలో ఉందని ఈ సర్వే నిరూపించిందన్నారు. ఇది కేవలం డేటా సేకరణ ప్రక్రియ మాత్రమే కాకుండా, సామాజిక న్యాయ విప్లవం,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సర్వేను విజయవంతంగా అమలు చేసిన రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

“తెలంగాణ పెద్ద స్థాయి డేటా సేకరణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ సర్వే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది,” అని మంత్రి అన్నారు.

బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ సర్వే తెలంగాణ చరిత్రలో ఓ స్వర్ణాధ్యాయం అని, ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని ప్రదర్శిస్తూ సర్వేలో పాలు పంచుకున్నారన్నారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి దామోదర్ రాజా నరసింహా మాట్లాడుతూ ఈ సర్వే సామాజిక న్యాయాన్ని నిర్ధారించడంలో నిబద్ధతతో కూడిన ప్రయత్నమని వ్యాఖ్యానించారు. గిరిజన సంక్షేమ మంత్రి ది. సీతక్క మాట్లాడుతూ ఇలాంటి సర్వేలు దేశవ్యాప్తంగా నిర్వహించాలని సిఫారసు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.
Instagram
Youtube
LinkedIn