పీసీసీ ఛీప్ గా జీవన్ రెడ్డి….?
1 min readతెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక చివరి స్టేజీకి వచ్చింది. అతి త్వరలోనే పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. అయితే ముందు నుంచి పీసీసీ రేస్ లో ఉన్నపేర్లు తారుమారైనట్లు తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలను అంచనా వేసిన తర్వాత జాబితాను కుదించినట్లు ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం. సీనియర్ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి ఢిల్లీ పెద్దలు సిద్దమైనట్లు తెలుస్తోంది. మొదటి నుంచి అనుకున్న పేరుకు ఏకాభిప్రాయం రాకపోవడంతో మధ్యేమార్గంతో ఫార్ములాను తయారు చేసినట్లు చెపుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు సీనియర్ నాయకులను పరిగణనలోకి తీసుకున్నట్లు చెపుతున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి చిన్నారెడ్డి పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇందులో జీవన్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా ఆయనకే పార్టీ పగ్గాలు అందే సూచనలున్నాయి. అధినేత్రి సోనియా గాంధీ ఆమోదముద్ర తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ క్యాంపైయిన్ కమిటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. ఆయన కూడా దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఓ టీవీ షో లో ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయడానికి తనకు ఆ పదవే సరైనదని ఆయన అన్నారు. ప్రజల్లోకి విస్రుతంగా వెళ్లడానికి తనకు అవకాశం వస్తుందని వ్యాఖ్యానించారు. పీసీసీ అధ్యక్ష పదవి తీసుకుంటే నాయకుల మధ్య ఉండాలని, క్యాంపైయిన్ కమిటీ అయితే ప్రజల్లో ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పుకోచ్చారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పైన ఇప్పటికే అధిష్టానం ఆయనకు సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చిందనే ప్రచారం పార్టీలో ఉంది. రేవంత్ రెడ్డిని పీసీసీ ఛీప్ చేయడానికి పార్టీ సీనియర్లతో పాటు ఎం.పిలు, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఇష్టపడటం లేదని సమాచారం. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ జరిపిన అభిప్రాయ సేకరణలో ఈ విషయం బయటపడింది. పార్టీ నాయకులు, డీసీసీ అధ్యక్షుల్లో ఎక్కువ మంది రేవంత్ రెడ్డికి అండగా నిలిచినప్పటికి ప్రజాప్రతినిధుల అభిప్రాయానికి అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ కి పీసీసీ ఇస్తే ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు సీనియర్లు పార్టీ మారే అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తోంది. అందుకే మధ్యేమార్గంగా జీవన్ రెడ్డిని పీసీపీ చేసి రేవంత్ రెడ్డికి క్యాంపైయిన్ కమిటీ అప్పగించనున్నట్లు సమాచారం. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎస్సీ, బీసీతో పాటు మహిళా నేతను నియమించే సూచనలున్నాయి.
మరో వైపు పీసీసీ ఛీప్ గా జీవన్ రెడ్డి గాంధీభవన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తే రేవంత్ ప్రజల్లోకి వెళ్లేలా అధిష్టానం ప్లాన్ రూపొందిస్తున్నట్లు సమాచారం. సమస్యలపైన క్షేత్రస్థాయి పోరాటాలు ఆయన ఆధ్వర్యంలో జరగనున్నాయి. క్యాంపైయిన్ కమిటీ ఛైర్మన్ హోదా రేవంత్ రెడ్డి త్వరలోనే భారీ పాదయాత్ర చేసే అవకాశాలున్నాయి.