టీఎస్ పీఎస్సీని మూసేయండి
1 min readతెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన సర్కార్ వైఖరీని తీవ్రంగా తప్పుపట్టింది. నాలుగు వారాల్లో టీఎస్ పీఎస్సీ కి ఛైర్మన్ తో పాటు సభ్యులను నియమించాలని కోర్టు స్పష్టం చేసింది. నిరుద్యోగి ఒకరు వేసిన పిటిషన్ పైన విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఒక వేళ టీఎస్ పీఎస్సీకి ఛైర్మన్ ను, సభ్యులను నియమించకపోతే మూసివేయాలని తేల్చి చెప్పింది. విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేసింది.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రస్తుతం ఒకే ఒకరు సభ్యుడుగా ఉన్నారు. కమిషన్ లో కోరం లేనందు వల్ల ఎలాంటి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత కొన్నాళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్ పడింది. నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమౌతున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోలేదు. టీఎస్ పీఎస్సీకి మొదటి ఛైర్మన్ గా చక్రపాణి ఇటీవల కాలం వరకు వ్యవహారించారు. ఆయనతో పాటు సభ్యుల పదవి కాలం ముగియడంతో వారంతా తప్పుకున్నారు. అప్పటి నుంచి టీఎస్ పీఎస్సీ ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపైన ద్రుష్టి సారించలేదు. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రకటించిన కేసీఆర్ కనీసం టీఎస్ పీఎస్సీ ఖాళీను కూడా భర్తీ చేయకపోవడం విశేషం. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికైనా ఛైర్మన్ తో పాటు కమిషన్ సభ్యులను ముఖ్యమంత్రి నియమిస్తారో లేక కౌంటర్ దాఖలు చేస్తారో చూడాలి.