రాహుల్ తో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల భేటీ
1 min readతెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. పార్టీ కార్యకర్తల భీమా కు సంబంధించిన చెక్ ను ఆయన చేతుల మీదుగా ఇన్సూరెన్స్ కంపెనీకి అందజేశారు. మొత్తం 6 కోట్ల 34 లక్షల రూపాయల చెక్ ను రాహుల్ గాంధీ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల ప్రమాద భీమా అందనున్నది. ప్రమాదవశాత్తు గాయపడిన వారికి కూడా భీమా సౌకర్యం దక్కుతుంది. తెలంగాణలో ఇప్పటి వరకు 40 లక్షలకు పైగా మెంబర్ షిప్ జరిగింది. దేశంలో మరెక్కడ ఇలాంటి సౌకర్యం కాంగ్రెస్ కార్యకర్తలకు లేకపోవడం విశేషం. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కీ, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీని కలిసిన వారిలో ఉన్నారు. వచ్చే నెల 4న రాహుల్ గాంధీ మరో సారి తెలంగాణ సీనియర్లకు అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను సవివరంగా ఆయనకు వివరించనున్నారు. రైతుల కోసం వరంగల్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరనున్నారు.