జానారెడ్డికి తోడు రేవంత్ రెడ్డి
1 min readనాగార్జున సాగర్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కచ్చితంగా ఇక్కడ విజయం సాధించాలన్న పట్టుదలతో ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ తరుపున సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండటంతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీకి ఉన్న పట్టు, జానారెడ్డి పైన ఉన్న అభిమానం కారణంగా కచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమా వారిలో కనిపిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందుగానే జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించింది. జానారెడ్డి గత కొన్నాళ్లుగా ఇక్కడే మకాం వేసి పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు. దాదాపు 40 యేళ్లుగా నాగార్జున సాగర్ తో ఆయనకు అనుబంధం ఉంది. ఇదే ప్రాంతం నుంచి ఆయన ఇప్పటికే ఏడు సార్లు విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఎదిగిన జానారెడ్డి రాష్ట్ర నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు పలువురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా పనిచేశారు. ఒకే సారి 17 మంత్రిత్వ శాఖలను నిర్వహించి ఆయన రికార్డు స్రుష్టించారు. అయితే గత ఎన్నికల్లో జానారెడ్డి నాగార్జునసాగర్ లో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. కేసీఆర్ వాహతో పాటు సామాజిక సమీకరణాల కారణంగా ఆయన వెనకపడాల్సి వచ్చింది. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికతో తిరిగి తన పట్టు నిరూపించుకోవడానికి జానారెడ్డి సిద్ధమయ్యారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన నియోజకవర్గంలో విస్రుత్తంగా పర్యటిస్తున్నారు. ఇక్కడ ప్రతి గ్రామంలో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. పేరు పెట్టి పిలిచేంత సన్నిహితులైన కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. దీంతో జానారెడ్డి ప్రచారానికి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు జానారెడ్డికి సరిపోయే స్థాయిలో అవతలి పార్టీల్లో అభ్యర్థులు కనిపించకపోవడంతో ఆయనే ఇక్కడ కీలకమయ్యారు.
మరో వైపు ప్రచారానికి కాంగ్రెస్ అన్ని విధాలుగా సిద్ధమౌతోంది. ఈ నెల 29న జానారెడ్డి నామినేషన్ వేయనున్నారు. భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయన ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. అంతకుముందే 27న సాగర్ జన గర్జన పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. హాలియాలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ ముఖ్యనేతలంతా హాజరవుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈ సభలో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. సభ తర్వాత నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డితో పాటు ఇతర సీనియర్లు మకాం వేయనున్నారు. జానారెడ్డి తరుపున వీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నారు. రేవంత్ రెడ్డిని నియోజకవర్గం అంతా ప్రచారం చేయించాలని జానారెడ్డి భావిస్తున్నారు. దీని ద్వారా యువతలో మరింత ఉత్సాహం వస్తుందన్న అంచనాలో ఆయన ఉన్నారు.
దుబ్బాక ,గ్రేటర్ , ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయంతో కాంగ్రెస్ నిరుత్సాహంగా ఉంది. నాగార్జున సాగర్ లో విజయం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న నైరాశ్యాన్ని పొగొట్టాలని పార్టీ భావిస్తోంది. అందు కోసం సర్వశక్తులు కూడగట్టుకొని పార్టీ నాయకులు సాగర్ బరిలోకి దూకనున్నారు.