రేవంత్ రెడ్డి …నాకు గాయమైంది అందుకే సెలవు
1 min readపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మధ్య వివాదం కొనసాగుతోంది. డీజీపీ వ్యవహార శైలిపైన, ప్రభుత్వ తీరు మీద రేవంత్ రెడ్డి గత కొన్నాళ్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీహారీ అధికారుల పాలన కొనసాగుతోందంటున్న ఆయన వారి సహకారంతో కేసీఆర్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇందులో భాగంగానే డీజీపీ మహేందర్ రెడ్డిని బలవంతంగా సెలవుపైన పంపించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఎసీబీ డీజీగా ఉన్న అంజనీకుమార్ కు డీజీపీగా తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. దీనిపైన కూడా రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన అన్ని విభాగాలకు బీహారీ ఐఎఎస్ అధికారులనే అధిపతులుగా నియమించారని ఆయన అంటున్నారు. దాదాపు 150 మంది ఎఐఎస్ అధికారులు తెలంగాణలో ఉంటే కొంత మందికే అనేక శాఖలను అప్పగించడం ఏమిటన్నది రేవంత్ రెడ్డి ప్రశ్న. అయితే దీనిపైన ఐఎఎస్ అధికారుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డికి మ్యానివల్ తెలియదని వ్యాఖ్యానించింది. మరో వైపు తనను బలవంతంగా సెలవుపైన పంపించారని చేసిన వ్యాఖ్యలపైన డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. ఇంట్లో జారిపడటంతో భుజానికి మూడు చోట్ల గాయమైందని ఆయన పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకే తాను విశ్రాంతి తీసుకుంటున్నానని మహేందర్ రెడ్డి వివరించారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు ఇందు కోసం సెలవు పెట్టానని డీజీపీ ప్రకటనలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఆరోపణల్లో ఎంత మాత్రం నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. మరి ఈ ఇద్దరి మధ్య వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.