చేతులు కలిపిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి
1 min readతెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విషయంలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు దాదాపుగా సమసిపోయాయి. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా అంగీకరించడానికి ఇష్టపడని నాయకులు ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. మొదటి నుంచి పీసీసీ విషయంలో తీవ్ర అసంత్రుప్తిగా ఉన్న ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా రేవంత్ రెడ్డితో చేయి కలిపారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం గాంధీభవన్ మెట్లు ఎక్కనన్న ఆయన ఇప్పుడు కొంత దిగివచ్చారు. కాంగ్రెస్ ఇందిరాపార్క్ లో ఏర్పాటు చేసిన వరిదీక్షకు కోమటిరెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డితో కలిసి కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇద్దరు నాయకులు అప్యాయంగా పలుకరించుకోవడంతో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి పనిచేయాలని కాంగ్రెస్ కేడర్ గట్టిగా కోరుకుంటోంది. నల్గొండ జిల్లాలో గట్టి పట్టున్న కోమటిరెడ్డి పార్టీలో అత్యంత కీలక నేత. ఆయన అసంత్రుప్తిని వీడిని రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడానికి ముందుకు రావడంతో ఆ పార్టీలో నెలకొన్న గందరగోళానికి దాదాపుగా తెరపడినట్లే.